ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. ఆర్టీసీ సమ్మెపై రేపటి బంద్‌కు టీఎన్జీవోస్, ప్రైవేట్ క్యాబ్స్ మద్దతు తెలిపినందున ప్రభుత్వ చర్యలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలు శక్తివంతులు, వాళ్లు తిరగబడితే ఎవరూ ఆపలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
 
ఆర్టీసీ సమ్మెపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సర్కారు బదులిస్తూ.. ఇప్పటికిప్పుడు ఎండీని నియమించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని తెలిపింది. సమర్థవంతమైన అధికారి ఇంఛార్జీగా ఉన్నారని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ సమాధానంతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. సమర్థుడైన అధికారి ఇంఛార్జీగా ఉంటే.. ఆయన్నే ఎండీగా ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆయన ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించింది. రేపటి బంద్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కార్మికుల ఎక్కువ డిమాండ్లు పరిష్కరించదగ్గవేనని, కార్మికులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏం ఇబ్బందని హైకోర్టు ప్రశ్నిచింది. 


ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించాలని హైకోర్టు సూచించింది. చర్చలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రజలే ప్రజాస్వామ్యమని.. ప్రజలకంటే ఎవరు గొప్పకాదంది. ఫిలిప్పీన్స్ రాజు విషయంలో ప్రజల తిరుగుబాటును ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది. అలాగే పాఠశాలల ప్రారంభంపై కూడా ప్రశ్నించింది. కాగా శనివారం ఉదయం 10:30 గంటలకు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని న్యాయస్థానం సూచించింది.                                                                                                                                                                                                                                                                                                               


మరింత సమాచారం తెలుసుకోండి: