ఈ మధ్య కాలంలో దొంగతనాలు, దోపిడీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి దొంగలను పట్టుకుంటున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రస్తుతం పాపిలాన్ అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరస్థులను సులభంగా పట్టుకుంటోంది. ఈ టెక్నాలజీ ద్వారా పాత నేరస్థుడు ఎవరైనా రోడ్డుపై కనిపిస్తే పోలీసులు నేరస్థులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర పోలీసులు పాపిలాన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా నేరాలు చేస్తున్న వారిని సులభంగా గుర్తిస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నామని చెబుతున్నారు. పోలీస్ శాఖ ఈ టెక్నాలజీ ద్వారా నేరం చేసిన వారి వేలిముద్రల ఆధారంగా పాత నేరస్థులను గుర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2017 సంవత్సరంలో అమెరికా నుండి ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకున్నారు. సాధారణంగా ఈ టెక్నాలజీని ఇంటర్ పోల్, అమెరికా దర్యాప్తు సంస్థలు మాత్రమే వినియోగిస్తాయి. 
 
టెక్నాలజీ ద్వారా తప్పు చేసిన నేరస్థులు తప్పించుకోలేరని పోలీసులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా పోలీసులకు అనుమనితుల నేర చరిత్ర కేవలం 5 నుండి 10 సెకన్లలో ట్యాబ్లెట్ లేదా కంప్యూటర్ మీద ప్రత్యక్షం అవుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా దోపిడీలు, దొంగతనాలు చేసిన వారి వివరాలను వేలిముద్రల విశ్లేషణ ద్వారా పోలీసులు తేలికగా గుర్తించవచ్చు. 
 
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం. ఈ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులు ఇప్పటివరకు 1345 దొంగతనాలలో నేరస్థులను గుర్తించారని సమాచారం. ఈ టెక్నాలజీ ద్వారా పోలీసులు 72 కేసుల్లో మృతదేహాలను కూడా గుర్తించారని సమాచారం. కొత్త పాస్ పోర్టు పొందాలని ప్రయత్నించిన 60 మంది నేరస్థుల్ని కూడా ఈ టెక్నాలజీ పట్టించింది. క్రిమినల్ మరియు క్రైమ్ కేసులను పాపిలాన్ టెక్నాలజీ వినియోగించి సులభంగా పట్టుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: