ప్రముఖ సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ ను నిన్న రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నిర్మాత పీవీపీ బండ్ల గణేష్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బండ్ల గణేష్ అరెస్ట్ గురించి వార్తలు రావటంతో పీవీపీ కేసులోనే బండ్ల గణేష్ ను అరెస్ట్ చేశారని అందరూ భావించినా పోలీసులు అరెస్ట్ చేయటానికి వేరే కారణం ఉందని తెలుస్తోంది. 
 
బండ్ల గణేష్ పై మరో కొత్త కేసు నమోదైందని కడప పోలీసులు బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారని తెలుస్తోంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించకపోవటంతో కొన్ని రోజుల క్రితం మహేష్ కడప పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈరోజు ఉదయం కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు బండ్ల గణేష్ ను హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉన్నా హాజరు కాకపోవటంతో కడప మెజిస్ట్రేట్ బండ్ల గణేష్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని తెలుస్తోంది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావటంతో బంజారాహిల్స్ పోలీసులు బండ్ల గణేష్ ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు బండ్ల గణేష్ మాత్రం ట్విట్టర్ ద్వారా "నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు. విచారణ కోసం పోలీసులు పిలవడం జరిగింది. నన్ను అరెస్ట్ చేస్తే మీకు తెలియజేస్తాను" అని అరెస్ట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. 
 
గత కొంతకాలంగా బండ్ల గణేష్ ను ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. టెంపర్ సినిమా విడుదలైన రెండు సంవత్సరాల తరువాత తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజుల క్రితం పీవీపీ తన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేదని, మనుషులను పంపి బండ్ల గణేష్ బెదిరించారని ఫిర్యాదు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: