ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.  ఈ సంబంధాలు దెబ్బతినడంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలు ఆగిపోయాయి.  అయితే, ఇండియా నుంచి అత్యవసర సేవలైన మెడిసిన్స్ మాత్రం ఎగుమతి జరుగుతున్నది.  కొన్నిరోజులపాటు మెడిసిన్స్ ను కూడా పాక్ వద్దనుకుంది.  అయితే, ఆ దేశంలో మందులకు కొరత ఏర్పడటంతో చేసేదిలేక తిరిగి మెడిసిన్స్ ను తీసుకోవడానికి ఓకే చెప్పడంతో ఇండియా నుంచి మెడిసిన్స్ ఎగుమతి జరుగుతున్నది.  


అయితే, ఇండియా నుంచి పాకిస్తాన్ కు రోజుకు అనేక పార్సిళ్లు వెళ్తుంటాయి. ఉత్తరాలు, చిన్న చిన్న వస్తువులు, డాకుమెంట్స్, ఇతర వస్తువులు వంటివి పాక్ కు వెళ్తుంటాయి.  పాక్ నుంచి స్వాతంత్య్రానికి పూర్వం ఇండియాలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు.  అవతల దేశంలో ఉన్న బంధువులు ఉన్నారు.  వాళ్లకు, వీళ్లకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుంటాయి.  ఇప్పుడు తపాలా సేవను పాక్ వద్దనుకుంది.  


ఇండియా నుంచి వచ్చే తపాలాను పాక్ నిషేదించింది.  ఈ నిషేధంతో ఇండియా నుంచే వెళ్లాల్సిన పార్సిల్స్ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయి.  తమిళనాడు నుంచి కనీసం రోజుకు ఒక పార్సిల్ చొప్పున పాక్ కు వెళ్తుంది.  అలా పాక్ వెళ్లే పార్సిల్స్ లో మందులు, వ్యవసాయ విత్తనాలు ఉన్నాయి.  వ్యవసాయ విత్తనాలను అక్కడి రైతులు వినియోగించుకుంటూ ఉంటారు. ఇండియా నుంచి విత్తనాలకు కొనుగోలు చేస్తుంటారు.  ఇప్పుడు ఆ విత్తనాలు బంద్ కావడంతో పాపం అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  


ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పాక్, కాశ్మీర్లో అలజడులు సృష్టించాలని చూస్తోంది.  ఉగ్రవాదులను ఇండియాలోకి పంపి ఇక్కడ అలజడులు సృష్టించి అంతర్జాతీయంగా ఇండియాను బ్లేమ్ చేయాలని అనుకుంటోంది.  కానీ, ఇండియా మాత్రం వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.  పైగా ఇటీవలే పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియన్ ఆర్మీ పీవోకే లోని నీలంలోయలో ఉన్న ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది.  ఇండియన్ ఆర్మీ చేసిన దాడిలో దాదాపు 50 మంది ఉగ్రవాదులు మరణించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: