తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ ఉపఎన్నికలో సాధించిన విజయం గురించి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థికి అఖండమైన మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన హుజూర్ నగర్ లో సభ జరగలేకపోయిందని సీఎం కేసీఆర్ చెప్పారు. 
 
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం తరువాత జరిగిన ఎన్నిక ఇది అని కేసీఆర్ అన్నారు. పని చేస్తూ పోతున్న ప్రభుత్వానికి హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితం టానిక్ లాగా పని చేస్తుందని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చాలా రకాల దుష్ప్రచారాలు చేశారని, నీలాపనందలు వేశారని కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో అభ్యర్థి సైదిరెడ్డిని 43 వేలకు పైగా మెజారిటీతో గెలిపించారని కేసీఆర్ అన్నారు. 
 
హుజూర్ నగర్ ప్రజలు ఏ ఆశలతో గెలిపించారో వారి ఆశలు నెరవేరుస్తామని, వారి కోరికలు నెరవేరుస్తామని కేసీఆర్ అన్నారు. 26వ తేదీ సాయంత్రం హుజూర్ నగర్ లో సభ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ అన్నారు. తప్పకుండా హుజూర్ నగర్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని సీఎం అన్నారు. ప్రతిపక్షాలు ఎదుటివారిని నిందించటమే రాజకీయం కాదని గుర్తు పెట్టుకోవాలని కేసీఆర్ అన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని రాష్ట్రం గురించి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయవద్దని కేసీఆర్ చెప్పారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని కేసీఆర్ అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షం పంథా మార్చుకోవాలని కేసీఆర్ అన్నారు. ప్రజలు 100 శాతం అన్నీ గమనిస్తూ ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పుడూ కూడా మేము గర్వపడలేదని మరింతగా బాధ్యత పెరిగిందని మరింత సంస్కారవంతంగా పని చేస్తూ ముందుకు పోతామని సీఎం కేసీఆర్ అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: