ఆర్టీసీ కార్మికులు , అధికారులు మంచివారేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . ఆర్టీసీ లో సమర్థులైన అధికారులు ఉన్నారని , అందుకే ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పారు . ఇక ఆర్టీసీ కార్మికులు యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడాలని సూచించారు . యూనియన్ నాయకులు అమాయక కార్మికుల గొంతు కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .   ఆర్టీసీని యూనియన్లే నాశనం చేశాయని అన్నారు . అన్నం పెట్టే సంస్థ కొమ్మను నరుకుంటారా ? అని కేసీఆర్ కార్మికులను   ప్రశ్నించారు .


 కార్మికులు అమాయకులైతే వెంటనే సంబంధిత డిపోలకు వెళ్లి దరఖాస్తు చేసుకుని విధుల్లో చేరిపోవాలని అన్నారు.  ఆర్టీసీ అనేది చాల రాష్ట్రాల్లో లేనేలేదన్న కేసీఆర్ , మధ్యప్రదేశ్ లో ఆర్టీసీని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు . ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయలేదని కమిటీ మాత్రమే వేశారని అన్నారు . దాని భవిష్యత్తు ఏమిటో తరువాత తేలుతుందని చెప్పారు . ఆర్టీసీ కార్మికులు ఏ ప్రభుత్వం ఉన్న సమ్మె తప్పదని , దానికి కారణం యూనియన్ ఎన్నికలేనని చెప్పారు . యూనియన్లు ఇలా ఉంటే ఆర్టీసీ మనుగడే కష్టమన్న కేసీఆర్ , ఇక పాత ఆర్టీసీ అనేది ఉండదని చెప్పారు .


ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనమన్నది అసంభవమని, భూగోళం ఉన్నంత వరకూ సాధ్యం కాదని  చెప్పుకొచ్చారు . ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేస్తే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు తమను కూడా విలీనం చేయమని కోరుతాయని , అప్పుడు ఆర్టీసీని విలీనం చేశావని వారిని కూడా చేయమంటూ న్యాయస్థానాలు కూడా తీర్పునిస్తాయని అన్నారు . ఇక సంస్థనే మునిగిపోతున్నప్పుడు ఇక విలీనం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కేసీఆర్ అన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: