తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పై టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఏకంగా నలభై మూడు వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. చివరకు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టిఆర్ఎస్ స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసినా... అవి తలకిందులు చేస్తూ 43 వేల ఓట్ల మెజార్టీ రావడం మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.


ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షించిన నియోజకవర్గం నిజామాబాద్. ఈ జిల్లాలో రైతులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా భారీగా నామినేష‌న్లు వేసి దేశ‌వ్యాప్తంగా అందరి దృష్టి నిజామాబాద్ వైపు ప‌డేలా చేశారు. ఈ రైతులు అంద‌రూ 95 వేల ఓట్లు చీల్చ‌డంతో ఎంపీగాగా పోటీ చేసిన కెసిఆర్ కుమార్తె క‌విత‌ బిజెపి అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉంటూ నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు.


దీంతో ఆయన చేసిన హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. వాస్తవంగా ఇక్కడ నోటిఫికేషన్ రావటానికి ముందు  క‌విత బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అయితే చివరకు కెసిఆర్ మాత్రం గత ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డినే రంగంలోకి దింపారు. దీంతో సైదిరెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతి క్యాష్ చేసుకుని బంప‌ర్ మెజార్టీతో గెలిచి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టారు. వాస్త‌వంగా క‌విత మొన్న ఎంపీగా గెలిచినా లేదా... ఈ ఉప ఎన్నిక‌ల్లో హుజూర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా గెలిచినా టీఆర్ఎస్ రాజ‌కీయాల్లో మ‌రింత కీల‌కంగా ఉండేవారు. అయితే ఆమెకు ప్ర‌స్తుతం రాజ‌కీయంగా కాలం క‌లిసి రావ‌డం లేద‌నే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: