నిన్న వెల్లడించిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ - శివసేన  కూటమి ఘన విజయం సాధించిన విషయం మన  అందరికీ తెలిసినదే. కానీ ఈ ఎన్నికల ఫలితాలలో  కాంగ్రెస్ కు ఒక మంచి పరిణామం అని చెప్పాలి. లోకసభ  ఎన్నికలలో మహారాష్ట్రలో  కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షమైన ఎన్సీపీ పార్టీ ఘోరంగా విఫలమయ్యాయి కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఈ రెండు పార్టీలు  కూడా అంచనాలకు మించి రాణించారు అని చెప్పాలి.


220 స్థానాలు సాధించి దేవేంద్ర ఫడ్నవిస్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ధీమాగా ప్రకటించిన బీజేపీ బొటాబొటీ సీట్లతో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతూండగా... ఉనికిలోనే ఉండదనుకున్న కాంగ్రెస్, ఎన్సీపీ అటు ఇటుగా వంద సీట్లు సాధించి తమ ఉనికిని బలంగా చాటుకున్నాయి. అసంతృప్తులు అధికార కూటమికి చేటు చేయగా.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రచారం ఆ పార్టీతోపాటు భాగస్వామి కాంగ్రెస్‌కూ కలిసొచ్చింది.


పూణే  సహకార బ్యాంకు కుంభకోణంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేరును చేర్చడం ద్వారా మరాఠా ఓటును కొల్లగొట్టాలనుకన్న కమలనాథుల ఆశలు నెరవేరకపోగా పశ్చిమ మహారాష్ట్రలో పవార్‌ వర్గీయులు మరింత బలపడేందుకు అవకాశం ఏర్పడింది.  పవార్‌ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పట్టును చాటుకున్నారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేసి  మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 122, శివసేన 62 స్థానాలు గెలుచుకోగలిగాయి. ఈసారి కలిసికట్టుగా బరిలోకి దిగినా గతంలో కంటే తక్కువ సీట్లు సాధించగలిగాయి.


147 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ దాదాపు 45 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి 42 సీట్లే దక్కాయి. రాహుల్, సోనియా, ప్రియాంక వంటి అగ్రనేతలెవరూ ప్రచారంలో పెద్దగా పాల్గొనకపోవడం, నాయకత్వ లేమి విజయావకాశాలను దెబ్బతీశాయని అంటున్నారు. కాంగ్రెస్‌ తన శక్తియుక్తులను వెచ్చింది  ఉంటే బీజేపీ మరిన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చేదని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఒకరు వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: