అధికార ప్రభుత్వం ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వట్లేదని విషయం మరోసారి రుజువైంది. ఒక శాసన సభ్యుడికి ఇవ్వాల్సిన కనీస రక్షణ కూడా కరువైంది అనే విమర్శలు వస్తున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరో సారి ఘోర అవమానం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆయన బెంగళూరు వెళ్లేందుకు తనకు భద్రత కల్పించాలంటూ మూడు పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చారు.

అయితే, ఆయనకు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ నుండి ఎస్కార్ట్ ఇవ్వడానికి ముందుకురాలేదు. దీంతో బాలకృష్ణ ఒక్కరే తన వాహనంలో బెంగళూరు వెళ్లిపోయారు. దీనికి తోడు నిన్న హిందూపురంలో బాలకృష్ణను కొందరు ప్రజలు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి  హాజరయ్యేందుకు బాలయ్య వెళ్తుండగా బాలయ్యను గ్రామస్థులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు.

కొడికొండ చెక్‌పోస్టు నుంచి హిందూపురం వచ్చే రహదారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారును ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. అనంతపురంజిల్లా లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్తులు బాలకృష్ణను అడ్డగించారు. లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు. నిన్నటి ఘటన నేపథ్యంలో బాలకృష్ణ బెంగళూరు పర్యనటకు వెళ్లేముందు తనకు ఎస్కార్ట్ కావాలంటూ మూడు పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ.... పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. దీంతో బాలయ్య ఒంటరిగానే తన వాహనంలో వెళ్లిపోయారు. బాలయ్యకు ప్రభుత్వం కావాలనే భద్రత కల్పించడం లేదని టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: