గత రెండు రోజులుగా కృష్ణా జిల్లా రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు కృష్ణా రాజకీయాలని హీట్ ఎక్కించాయి. మొన్న ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి వంశీ... తెలుగుదేశం పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పార్టీ మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వంశీ మాత్రం వాటిని ఖండిస్తూనే నియోజకవర్గంలో సైలెంట్ గా పని చేసుకుంటున్నారు.


ఈ క్రమంలోనే వంశీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన ఎన్నికల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని కేసు నమోదైంది. ఈ కేసు కనుక రుజువైతే జైలుకు వెళ్లడంతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. ఈ నేపథ్యంలో వంశీ వ్యూహాత్మకంగా ఆలోచించి వైసీపీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఆలోచన రావడమే తరువాయి తన మిత్రుడు మంత్రి కొడాలి నానితో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యాడు. మొత్తం విషయాన్ని వివరించారు.


వైసీపీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జగన్ కండిషన్ ఒకటి పెట్టారు. పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే రావాలని సూచించారు. అలాగే మళ్ళీ ఉపఎన్నికల్లో తిరిగి గెలిచే సత్తా ఉంటేనే పార్టీలోకి రమ్మని చెప్పారు. ఇక వంశీ మరోమాట లేకుండా ‘ఎస్’అని చెప్పి వచ్చేశారు. అయితే వంశీ ఇంత ధీమాగా చెప్పడానికి కారణం లేకపోలేదు. రాజీనామా చేస్తే మరో ఆరు నెలల్లో ఉపఎన్నిక వస్తుంది. ఆ ఉపఎన్నికల్లో ఖచ్చితంగా వంశీకే సీటు దక్కుతుంది. గెలుపు కూడా వంశీ వైపు ఉంటుంది.


ఎందుకంటే వంశీ రెండుసార్లు గెలిచాడు అంటే పార్టీ ఇమేజ్ తో సొంత ఇమేజ్ కూడా ఉంది. ఆ ఇమేజ్ వల్లే మొన్న అంత వైసీపీ గాలిలో కూడా విజయం సాధించగలిగారు. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తే...ఆ పార్టీ ఓటింగ్ తో పాటు, వంశీతో పాటు వైసీపీలోకి వచ్చే కొంత టీడీపీ కేడర్ మద్ధతు, వంశీ అభిమానుల మద్ధతు పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల వంశీ దాదాపు 20 వేల మెజారిటీపైనే గెలిచే అవకాశముంది. మొత్తానికి వంశీ వైసీపీలోకి వస్తే గెలిచే సత్తా గట్టిగానే ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: