వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండు , మూడు రోజుల వ్యవధిలో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.  భార్య, భర్తలు ఇద్దరు వేర్వేరు  పార్టీలో కొనసాగడం పట్ల వైఎస్సార్సీపీ నాయకత్వం అభ్యంతరం తెలియజేసినట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో,   దగ్గుబాటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది .  దగ్గుబాటి ప్రస్తుతం  వైసీపీలో కొనసాగుతుండగా,  పురంధరేశ్వరి బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.


 బిజెపి లో కొనసాగుతున్న పురంధరేశ్వరి తరుచూ వైకాపా  ప్రభుత్వం పై విమర్శలు చేస్తుండడంతో,  ఆమెను కూడా వైకాపా లోకి తీసుకురావాలని పార్టీ నాయకత్వం దగ్గుబాటి కి  సూచించినట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి .  అయితే దగ్గుబాటి పురంధరేశ్వరి వైకాపాలో చేరడానికి పెద్దగా  ఆసక్తి చూపకపోవడంతో వెంకటేశ్వర రావే వైకాపాను వీడాలని  నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు  స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే పురందేశ్వరి కూడా బీజేపీ తరుపున  లోక్ సభ స్థానానికి పోటీ చేసి   పరాజయం పాలయ్యారు .


 అయితే ఇరువురు ఓటమి పాలయినప్పటికీ , ఇరువురు చెరొక పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు దగ్గుబాటి వైకాపా లో చేరారు . తన కుమారుడు హితేష్ చెంచు రామయ్య ను పరుచూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దించాలని భావించారు . కానీ సాంకేతిక కారణాల వల్ల హితేష్ పోటీ చేసే అవకాశం లేకపోవడం తో దగ్గుబాటి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు . కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైకాపా లో చేరిన దగ్గుబాటి , తన కోరిక తీరకుండానే ఆ పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: