జగన్ ఏపీ సీఎంగా 151 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టి జనం నీరాజనం పలికారు. మరి జగన్ పాలన ఎలా ఉంది.. ఏ పాయింట్లు ప్లస్.. ఏ పాయింట్లు మైనస్.. జనం ఏమనకుంటున్నారు.. ఓసారి పరిశీలిద్దాం..


గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను సృష్టించిన తీరు పట్ల తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉద్యోగమే దొరకదేమో అనుకుంటున్న లక్షలాది మందికి జగన్‌ చేసిన ప్రయోగం ఆశలు కల్పించింది. ఇక జగన్ నిర్ణయాల్లో 70 శాతం జనం మెచ్చారు. మరో 30 శాతం అంశాల్లో మెరుగుదల కోరుకున్నారు. మెచ్చుకున్న వాటిలో ఆరోగ్యం ముందు వరుసలో ఉంది.


వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి, ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో, ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పేద ప్రజలకు గొప్ప వరంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


శ్రీకాకుళం జిల్లా, ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం కోసం రూ. 600 కోట్లతో మంచినీటి పథకం ప్రకటించడం పట్ల ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్‌ను, ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకు పెంచి, పింఛను పొందడానికి అర్హత వయసును 65 నుంచి 60కు తగ్గించడం పట్ల సంతోషంగా ఉన్నారు. దీని వల్ల అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం కలుగుతుందని అంచనా.


45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుటుంబానికి వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ. 75 వేలు ఆర్థిక సాయం. దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌.. వల్ల పోలీసు కుటుంబాల్లో ఆత్మస్ధ్యయిర్యం నింపింది.


కాపు కార్పొరేషన్‌కు తొలి బడ్జెట్‌లోనే రూ. 2 వేల కోట్లు నిధులు.. 5 ఏళ్ళలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల కాపు సామాజిక వర్గంలో జగన్‌ పట్ల విశ్వసనీయత పెరిగింది.


సామాన్య ప్రజల నిత్యావసర రవాణా వ్యవస్ధ , ప్రగతి రథ చక్రాలైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా, క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం ఒక విప్లవాత్మక,కార్మిక పక్షపాత చర్యగా అన్ని వర్గాల ప్రజలంటున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటన కూడా ఉద్యోగుల్లో సంతోషం నింపింది.


ఆశా వర్కర్ల జీతాలు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు, అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ. 10,500 నుంచి రూ.11,500కు పెంపు. అంగన్‌ వాడీ ఆయాల జీతం రూ. 6 వేల నుంచి రూ. 7 వేలకు పెంపు. డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్‌లకు గౌరవ వేతనం రూ. 3,000 నుంచి రూ. 10 వేలకు పెంపునకు నిర్ణయం పట్ల గ్రామీణ మహిళలు వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.


ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖల్నిమార్చి ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్‌ వాల్‌, సరైన టాయ్‌లెట్లు, మంచినీటి సదుపాయం, తదితర మౌలిక వసతుల కల్పన,అమ్మ ఒడి ద్వారా.. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ. 15,000, ఇంటర్మీడియేట్‌ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ. 20 వేలు, సాలూరులో ట్క్రెబల్‌ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు లాంటి నిర్ణయాలను పేరెంట్స్‌ హర్షిస్తున్నారు.


ప్రతీ రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ఏటా రూ. 12500. విడతల వారీగా 50 వేల రూపాయల నగదు చెల్లింపు, ప్రమాదవశాత్తూ చనిపోయినా లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ బీమా ద్వారా రూ. 7 లక్షల నష్టపరిహారం చెల్లింపు కూడా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచింది.


సంపూర్ణ మద్యనిషేధం తీసుకువస్తానని వై.ఎస్‌ .జగన్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినప్పుడు, చాలామంది నమ్మలేదు. తొలి అడుగుగా, బెల్ట్‌ షాపులు మూయించి, మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించడానికి పూనుకుంది. విక్రయాలు ప్రారంభించినప్పుడే 20శాతం దుకాణాల సంఖ్యను తగ్గించారు. అదే తొలి అడుగు. అమ్మకాల వేళలను ఉదయం 11 నుంచి రాత్రి 8వరకే పరిమితం చేశారు. దాంతోపాటు ధరలు పెంచారు. ఇవి మలి అడుగులు. ఇది కూడా వినియోగం మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ నిషేధం దిశగా మలిఅడుగులుగా గృహిణులు నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: