తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ఆగటం లేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో కండక్టర్ గా పనిచేస్తున్న నీరజ ప్రభుత్వ వైఖరితో కలత చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నీరజ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. నీరజ మృతితో ఆగ్రహించిన కార్మికులు సత్తుపల్లి డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. 
 
మహిళా కండక్టర్ మృతితో తోటి ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నీరజ మృతితో సత్తుపల్లి డిపో దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 రోజులుగా ఉధృతంగా సాగుతోంది. సమ్మె నేపథ్యంలో నీరజ తీవ్ర మనోవేదనకు గురైందని అందువలన నీరజ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
 
దీపావళి పండుగ కావటంతో నిన్న నీరజ సొంతూరైన పల్లెగూడెంకు వెళ్లారు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొనాలని సమాచారం అందటంతో ఖమ్మంలోని ఇంటికి చేరుకొన్న నీరజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. భారీ సంఖ్యలో కార్మిక సంఘాల నేతలు నీరజ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. 
 
అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మికులు సత్తుపల్లి డిపో దగ్గర ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. నీరజ మృతితో ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంటే ప్రభుత్వ వైఖరితో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమైన రోజు నుండి ఇప్పటివరకు కొంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు. 


 
 
 




మరింత సమాచారం తెలుసుకోండి: