వల్లభనేని వంశీ....కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నేత. గత నాలుగు రోజులుగా వంశీ చుట్టూనే కృష్ణా జిల్లా రాజకీయాలు తిరుగుతున్నాయి. హఠాత్తుగా కేసులు మీద పడటంతో వంశీ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిపోతున్నారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీలోనే తన మిత్రులతో కలిసి జగన్ కూడా కలిశారు. దీంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమైందని అంతా అనుకున్నారు. కానీ దీపావళి రోజు వంశీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. టీడీపీకి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.


ఇక దాని ప్రతిగా బాబు కూడా లేఖ రాశారు. వైసీపీపై కలిసి పోరాడదామని, పార్టీని వీడొద్దని కోరారు. అలా వీరి మధ్య లేఖల పర్వం నడుస్తుండగానే, బాబు..వంశీ వద్దకు ధూతలుగా కేశినేని నాని, కొనకళ్ళ నారాయణలని పంపించారు. వారి వంశీతో మాట్లాడి, వంశీ పార్టీని వీడరని ప్రకటన చేశారు. అయితే వంశీ గురించి బాబు టీడీపీ నేతలతో చర్చలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ వంశీ నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పారా?  వైసీపీ చెప్పినట్లు డ్రామా ఆడుతున్నారా? లేక ఆయనే ఏమైనా సొంతంగా వ్యూహం అమలు చేస్తున్నారా? అనేది ఎవరికి అంతు చిక్కకుండా ఉంది.


వెళితే వైసీపీలోకి వెళ్ళాలి లేదంటే టీడీపీలో ఉండాలి. అలా కాకుండా ఈ రాజకీయ సన్యాసం డ్రామా ఏంటో వంశీకే తెలియాలి. కానీ ప్రస్తుతం వంశీ అనుచరుల్లో వస్తున్న టాక్ ప్రకారం చూసుకుంటే...ఆయన ఇప్పుడే ఏ పార్టీలోకి వెళ్లడని తెలుస్తోంది. మొదట టీడీపీని వీడి...ఉప ఎన్నికల వరకు న్యూట్రల్ గా ఉండి, ఆ తర్వాత వైసీపీలో చేరడమే వంశీ వ్యూహంగా ఉందని అంటున్నారు.


అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం చేయకపోవడం జగన్ చేతిల్లో ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే ఈలోపు టీడీపీ ఏమైనా బుజ్జగిస్తే అందులోనే కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో వెంటనే వైసీపీలో చేరే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి చూడాలి వంశీ ఈ రాజకీయ సన్యాసం డ్రామాకు ఎప్పుడు తెరదించుతారో?


మరింత సమాచారం తెలుసుకోండి: