కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బీజేపీ నుంచి వైసీపీలో చేర‌డంపై క్లారిటీ ఇచ్చారు. త‌న భ‌ర్త, మాజీ ఎమ్మెల్యే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, కొడుకు హితేష్‌ వైసీపీలో ఉన్న నేప‌థ్యంలో వైసీపీ నుంచి పురందేశ్వ‌రికి బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌కటించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా వార్త‌లు హ‌ల్ ఛ‌ల్ చేస్తున్నాయి. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు, ఆయ‌న కొడుకు హితేష్‌కు పార్టీలో స‌ముచిత స్థానం ద‌క్కాలంటే పురందేశ్వ‌రిని బీజేపీకి రాజీనామా చేయించి వైసీపీలోకి తీసుకురావాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.


అంతే కాదు వెంక‌టేశ్వ‌ర‌రావు  వైసీపీ ఎంపీ విజ‌య‌సాయితో ఫోన్‌లోనే వైసీపీకి గుడ్‌బై చెప్పిన‌ట్లు వార్త‌లు గుప్పుమంటున్న త‌రుణంలో పురందేశ్వ‌రి త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా చెప్పారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న పురందేశ్వ‌రి మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక‌లకు ముందు వైసీపీలోకి రావాల‌ని న‌న్ను ర‌మ్మ‌న్న విష‌యం నిజ‌మేన‌ని, ఇప్పుడు ఎవ్వ‌రు ఆహ్వానించ‌లేద‌ని అన్నారు. నా భ‌ర్త వెంక‌టేశ్వ‌ర‌రావు, కొడుకు హితేష్ వైసీపీలో చేరిన‌ప్పుడు ఎలాంటి కండిష‌న్లు పెట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. నేను బీజేపీలో ఉన్నా కూడా వారు అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని, కానీ ఇప్పుడు కండిష‌న్లు పెడుతున్న‌ట్లు తెలిసింది నిజ‌మేన‌ని అన్నారు.


వైసీపీ నేత‌లు త‌న భ‌ర్త‌, కుమారుడికి కండిష‌న్లు పెట్టిన మాట వాస్త‌వ‌మే. అందులో భాగంగానే టీడీపీలో ఉన్న రామ‌నాథం బాబును వైసీపీలోకి తీసుకున్నార‌ని చెప్పారు. పార్టీలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌ను ద‌గ్గుబాటి వ‌ర‌కు రాకుండా చేస్తున్నారని, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని.. ఇది త‌మ‌కు అవ‌మాన‌మే అని ఆమె ఆవేద‌న చెందారు. వైసీపీ నుంచి ద‌గ్గుబాటికి ఓ ఫోన్ మెసెజ్ వ‌చ్చిందని, పురందేశ్వ‌రి బీజేపీలో, మీరు వైసీపీలో ఉండ‌టం బాగా లేద‌ని ఇద్ద‌రు ఒకే పార్టీలో ఉంటే బాగుంటుంద‌ని అందులోని సారాంశం అని వివ‌రించారు.


అందుకే కుటుంబంలో చ‌ర్చించిన మీద‌ట ద‌గ్గుబాటి వైసీపీకి రాజీనామా చేసి, రాజ‌కీయాల‌కు పూర్తిగా విరామం తీసుకునే ఆలోచ‌న చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. అంతే కాదు తాను పార్టీ మారే ఆలోచ‌న లేద‌ని, బీజేపీలోనే కొన‌సాగుతాన‌ని క్లారిటీ ఇచ్చారు పురందేశ్వ‌రి. ఇప్పుడు ద‌గ్గుబాటి పూర్తిగా రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పి, పురందేశ్వ‌రి, త‌న కొడుకు రాజ‌కీయాల్లో కొన‌సాగుతార‌ని స్పష్టం చేసింది. సో ఇక ద‌గ్గుబాటి రాజ‌కీయ జీవితంకు శుభం కార్డు ప‌డ్డ‌ట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: