ఇసుక అంశం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకే కొంత జాప్యం జరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది. రాజకీయ పార్టీలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మరోపక్క భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా సీఎం జగన్ ఇసుకపై స్పందించారు.

 

 

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సమీక్షించారు. పళ్లు ఇచ్చే చెట్టు మీదే రాళ్లు వేస్తున్నారంటూ ఇసుక వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘గతంలో వ్యవస్థ తీవ్ర అవినీతిమయం అయింది దీన్ని పూర్తిగా రిపేర్ చేస్తున్నాం. ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాం. ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలం. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు వస్తున్నాయి. వర్షాలు కురవడం రైతులకు మంచిదే. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే. కానీ రాబందుల మాదిరిగా మనపై రాళ్లు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోంది. వరదల వల్ల 90 రోజుల్లో ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నాం. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నాం. ఇసుక వారోత్సవం అని కార్యక్రమం కూడా పెడతాం. వారం రోజులు ఇసుక మీదే పనిచేద్దాం. ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లడకుండా చేద్దాం.

 

 

ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదు. ఒక్క లారీ ఇసుక కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వద్ద గట్టి పహారా ఉండాలి. డీజీపీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలి. మనం ఎంత బాగా పనిచేసినా మనపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అందుకే మనం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది’ అంటూ సీఎం స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: