టీ కాంగ్రెస్‌లో హుజూర్‌న‌గ‌ర్ ఉప పోరు ఫ‌లితాలు చిచ్చు పెట్టాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లో పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలీపై సీనియ‌ర్లు భ‌గ్గుమ‌న్నారు. కాంగ్రెస్‌ పార్టీలో స‌మ‌న్వయం చేసేవారు క‌రువ‌య్యార‌ని సీనియ‌ర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మంగ‌ళ‌వారం గాంధీభవన్‌లో కుంతియా అధ్యక్షతన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తి ఓటమి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు, క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న‌, త్వ‌ర‌లో రాబోతున్న‌ మున్సిపల్ ఎన్నికలపై చర్చ జ‌రిగింది. ఈ స‌మావేశంలో పాల్గొన్న సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ వి.హ‌నుమంత‌రావు నేత‌ల తీరుపై అస‌హానం, అగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


పార్టీ నేత‌ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై  తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు సీనియర్ నేత వీహెచ్.  కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవరూ పదవి చేపట్టకముందు కార్యకర్తలతో సీఎం అని పిలుపించుకోలేదన్నారు వీహెచ్. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వీహెచ్ డిమాండ్ చేశారు. అయితే  హుజూర్ నగర్ ఉప ఎన్నిక‌ల్లో  ఓటమికి నాదే బాధ్యతని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు.


హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం కొంత సన్నగిల్లిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ఓటింగ్ ను ఈ నియోజకవర్గంలో నిలుపుకొనే ప్రయత్నం చేసిన విషయాన్నిఉత్తమ్  గుర్తు చేశారు. ఉప పోరులో పార్టీలో స‌మ‌న్వ‌యం లోపం ఏమీ లేద‌ని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సామధాన‌బేధ దండోపాయాలు ఉప‌యోగించి గెలిచింద‌న్నారు. అధికారంలో ఉన్న పార్టీ అధికార యంత్రాంగాన్ని పాల్ప‌డింద‌ని ఉత్త‌మ్ వ్యాఖ్యానించారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ ఉప ఎన్నిక‌ల‌ను అప‌హాస్యం చేశార‌ని స‌మావేశంలో అన్నారట‌. ఇక  కోర్ కమిటీ సమావేశానికి భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ హాజరు కాలేదు. మరో సీనియర్ నేత జానారెడ్డి సమావేశం చివర్లో వచ్చారు. ఇక పార్టీ ఓట‌మితో మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు పార్టీకి షాక్ ఇచ్చి బ‌య‌ట‌కు వెళ‌తార‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: