కేంద్రంలో వ‌రుస‌గా రెండో సారి చ‌క్రం తిప్పుతున్న బీజేపీ రాష్ట్రాల్లోనూ అధికారం చ‌లాయించాల‌ని చూడ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టరు. కానీ, ఈ క్ర‌మంలో అతిపెద్ద జాతీయ పార్టీ ఎంచుకున్న‌మార్గాలే న‌వ్విపోతున్నాయి! ముఖ్యంగా ద‌క్షిణాదిలో క‌ర్ణాట‌క‌లో ఇటీవ‌ల అక్క‌డ ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఏర్పాటైన జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి స‌ర్కారును కూల‌దోసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక‌, ఏపీ, తెలంగాణ‌ల్లో అలాంటి ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి.. ఏదో విధంగా ఇక్క‌డి ప్ర‌భుత్వాల‌ను అభాసు చేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. స‌రే! కానీ, ఈ క్ర‌మంలోనే బీజేపీ అనుస‌రిస్తున్న వైఖ‌రిని అంద‌రూ అస‌హ్యించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.


తెల్ల‌వారి లేస్తే.. ప్ర‌జాస్వామ్యం, గాంధీ మార్గం అంటూ నీతి ప‌న్నాలు వ‌ల్లించే బీజేపీ నేత‌లు.. ప‌క్క‌పార్టీల టికెట్ల‌పై గెలిచిన నాయ‌కుల‌ను ఏమాత్రం ఇంగితం లేకుండా త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు, ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కులు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నారంటూ.. ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి తాజాగా చెప్ప‌డం ఆయ‌న అజ్ఞానికి మ‌చ్చుతునక అంటున్నారు. ఎవ‌రైనా ప్ర‌జాబ‌లం ఉన్న‌వారు.. పోయి పోయి ఏమాత్రం ఓటు బ్యాంకు (ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో క‌నీసం 4% కూడా రాలేదు)లేని బీజేపీలో చేరి.. మ‌త‌త‌త్వ ముసుగు వేయించుకునేందుకు ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ‌తారా?  ఏమాత్రం ప్ర‌జ‌ల్లో సానుభూతి లేని బీజేపీలోకి చేరి.. తాము కూడా ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతారా? అనే చిన్న‌ విష‌యాన్ని కూడా వ‌ద‌లేసి ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కులు వైసీపీలోను, టీడీపీలోను చేరేందుకు, ఉండేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని చెప్ప‌డం హాస్యాస్పదంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన వంశీని త‌మ పార్టీలోకి ఆహ్వానించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. కానీ, ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కులంద‌రూ బీజేపీ వైపు చూస్తున్నార‌ని చెప్ప‌డంలోనే త‌మ పార్టీని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నార‌ని సొంత గూటి నుంచే విష్ణుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నాయ‌కుల‌ను మెచ్చుకోవ‌డం, త‌మ‌వైపు తిప్పుకోవ‌డం అనేది రాజ‌కీయాల్లో కామ‌న్‌గానే జ‌రిగే ఓ తంతు. అయితే, ఈ సంద‌ర్భంలో బీజేపీని డైల్యూట్ చేసేలా విష్ణు వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని బీజేపీ నేత‌లే అంటున్నారు. ప్ర‌జా బ‌లం ఉన్న నాయ‌కులు, త‌మ సొంతంగా ఎదిగిన నాయ‌కులు వ‌చ్చి బీజేపీలో చేరితేనే త‌ప్ప పుంజుకోలేని పార్టీ ఎన్నాళ్లు మ‌న‌గ‌లుగుతుంద‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తుంది.


పార్టీకి వ్య‌వ‌స్థాగతంగా మంచి కేడ‌ర్‌. గ‌ట్టి ఓటు బ్యాంకు లేన‌ప్పుడు, నాయ‌కుల బ‌లాబ‌లాల‌పై ఆధార‌ప‌డితే.. ఆయా పార్టీల ఫ్యూచ‌ర్ ఏంటో కూడా ప్ర‌జాస్వామ్యంలో చూస్తేనే ఉన్నాం. అలాంటివి అన్నీ తెలిసి ఉండి కూడా అటు పార్టీని, ఇటు రాజ‌కీయాల‌ను ఇత‌ర పార్టీల‌ను కూడా కించ‌ప‌రిచేలా మాట్లాడ‌డం త‌గ‌ద‌నేది సొంత పార్టీ నుంచే వినిపిస్తున్న వ్యాఖ్య‌. మ‌రి ఇప్ప‌టికైనా వాస్త‌వంలోకి వ‌స్తారో రారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: