పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో వైయస్సార్ విగ్రహ ఏర్పాటులో వివాదం చోటు చేసుకుంది. వినాయకుని విగ్రహం తీసివేసి ఆ స్థానంలో వైయస్సార్ విగ్రహ ఏర్పాటు చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి సమయంలో వైసీపీ నేతలు వినాయకుని విగ్రహం తొలగించి వైయస్సార్ విగ్రహం పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను పట్టిన్నపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. 
 
గ్రామస్తులు ప్రశ్నించినందుకు తమపై దాడులు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైయస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించటానికి గ్రామానికి చెందిన వారు అంగీకరించారు. మూడు రోడ్ల కూడలి దగ్గర వైయస్సార్ విగ్రహ ప్రతిష్ట చేయాలని మండపం కూడా కట్టారు. కానీ కొన్ని కారణాల వలన గతంలో విగ్రహ ఏర్పాటు జరగలేదు. 
 
ఆ తరువాత ఆ మండపంలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహానికి ఉత్సవాలు జరిపించటంతో పాటు అన్నసంతర్పణ వంటి కార్యక్రమాలను భక్తులు నిర్వహిస్తున్నారు. కానీ కొన్నిరోజుల నుండి అక్కడ వినాయకుని విగ్రహం తొలగించి వైయస్సార్ విగ్రహాన్ని పెట్టాలని కొందరు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 
 
అర్ధరాత్రి దౌర్జన్యంగా వైయస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ స్థలం గణిరాజా అనే వ్యక్తి ఇంటిముందు  ఉంది. తమకు ఇష్టం లేకపోయినా విగ్రహం పెట్టాలని వైసీపీ కార్యకర్తలు పంతానికి పోతున్నారని గణిరాజా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో దౌర్జన్యం చేయటం ఏమిటని గణిరాజా కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. వినాయకుని విగ్రహ ప్రతిష్ట వలన తమ కుటుంబానికి మంచి జరుగుతోందని వినాయకుని విగ్రహం తొలగించవద్దని గణిరాజా కుటుంబసభ్యులు కోరుతున్నారు. గణిరాజా కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగినట్లేనని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: