మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన పార్టీల మధ్య ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న చిక్కుముడి వీడటం లేదు. శివసేన అహంకారం తగ్గించుకొని మెట్టు దిగాలని బీజేపీ పార్టీని ఉద్దేశించి చెబుతోంది. తాజాగా శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. శివసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.  నిన్న సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు. మరోవైపు బీజేపీ పార్టీకి స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు పెరుగుతోంది.

బీజేపీ పలువురు శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతోంది. ప్రత్యామ్నాయం కోసం బీజేపీ పార్టీ తెరవెనుక మంతనాలు జరుపుతోంది. బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ కొంతమంది ఎమ్మెల్యేలు లేఖలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ పట్టు వీడకపోవటం శివసేన మెట్టు దిగకపోవటంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితులలోను ముఖ్యమంత్రి పీఠం ఇచ్చే అవకాశం మాత్రం లేదని చెబుతోంది.

శివసేన పార్టీ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎట్టి పరిస్థితులలోను వదులుకోమని ప్రకటన చేస్తోంది. బీజేపీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలను అప్పగిస్తామని బీజేపీ శివసేన పార్టీకి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శివసేన పార్టీలో బీజేపీ ఇచ్చిన ఆఫర్ గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ శివసేన పార్టీలు రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఇరు పార్టీలకు చెందిన నేతలు చెబుతున్నారు.

శివసేన ఈ వైఖరి ద్వారా ఎక్కువ పదవులు పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ శివసేన ప్రభుత్వమే ఖచ్చితంగా ఏర్పడుతుందని తెలుస్తోంది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఐతే ఉందని తెలుస్తోంది. 2014 ఎన్నికలలో 122 ఎమ్మెల్యే స్థానాలు సాధించిన బీజేపీ ప్రస్తుతం కేవలం 105 స్థానాలకు పరిమితమైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొన్ని కారణాల వలన బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని సమాచారం. బీజేపీ పార్టీ నేతలు కూడా శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారే తప్ప ఎన్సీపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాత్రం చెప్పకపోవటం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: