జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మూడో తారీఖున విశాఖలో ఇసుక సమస్యపై ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇందుకు ఆయన అన్ని పార్టీల మద్దతు కోరారు. పవన్ కల్యాణ్ ర్యాలీకి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇంకా టీడీపీ ప్యాకేజీలు వదిలిపెట్టలేదని విమర్శిస్తున్నారు.


వైసీపీలో ఘాటుగా కామెంట్లు చేసే విజయసాయిరెడ్డి ఈ విషయంపై మండిపడ్డారు. ఇసుక కొరత పేరుతో 'ఇస్కో.. ఉస్కో' అనడమే పరువు తక్కువ పని అని... దానికి చంద్రబాబు మద్దతు ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు. పార్టనర్ ఖర్చుల కోసం ప్యాకేజీని సమకూర్చడం దగ్గర నుంచి పచ్చ మీడియాలో కవరేజి దాకా స్క్రీన్ ప్లే, దర్శకత్వం నిర్మాణం అన్నీ మీరే కాదా? అని ప్రశ్నించారు. మళ్లీ సపోర్ట్ స్టేట్ మెంట్ ఎందుకో అని అడిగారు. మీ గురించి ఎవరికి తెలియదనుకుంటున్నారని అన్నారు.


ఐదేళ్లలో చంద్రబాబు ఇసుక మొత్తం దోచేసి..ఇప్పుడు మా ప్రభుత్వంపై పిల్లి శాపాలు పెడుతున్నారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నదులు, వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికి ఉండేది కాదని విజయసాయిరెడ్డి చెప్పారు. మరో ఐదేళ్లకు సరిపడా ఇసుకను కూడా చంద్రబాబు మాఫియా స్మగ్లింగ్ చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా గోదావరి ఇసుకే కనిపించేదని అన్నారు. చేసిందంతా చేసి... వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పడు పిల్లి శాపాలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని... ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్ని నాలుగు నెలల్లోనే 80 శాతం నెరవేర్చడమే ఇందుకు కారణమని విజయ సాయి రెడ్డి కామెంట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: