శ్రీకాకుళం జిల్లాలో ఓ ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పి వందలాది మంది ప్రాణాలు నిలబడ్డాయి. లోకో పైలట్ అప్రమత్తతే ఓ దుర్ఘటన జరుగకుండా కాపాడింది. దిగా నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలుకు ఈ ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో విరిగిన పట్టాను గమనించిన లోకో పైలట్ చాకచక్యంగా రైలును ఆపేశాడు. అప్పటికే ఇంజిన్ తో సహా మూడు భోగీలు విరిగిన పట్టా మీదుగా వెళ్లిపోయాయి. తాను విరిగిన పట్టాను గమనించి రైలును ఆపే క్రమంలో మూడు భోగీలు వెళ్లిపోయాయి. అయితే ఎటువంటి ప్రమాదం జరుగకుండా రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది.

 

 

విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అక్కడ మరమ్మత్తులు చేపట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు మరమ్మత్తులు నిర్వహించాక రైలును పంపించారు. ఈ క్రమంలో పట్టాను పరిశీలించిన అధికారులు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు డ్రైవర్ ను అభినందించారు. అతని చాకచక్యాన్ని ప్రశంశించారు. సంఘటన గురించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని అధికారులు తెలిపారు. నిత్యం వేగంగా ప్రయాణించే రైళ్లు ఈ మార్గం గూండా వెళ్తూంటాయి. దీంతో పట్టాలు ఒక్కోసారి ఇలా ప్రమాదాలకు కారణమవుతాయి. సిబ్బంది నిత్యం పర్యవేక్షణలో పట్టాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూంటారు కూడా.

 

 

రైలు ప్రమాదాలు జరిగిన సంఘటనల్లో ప్రధానంగా రైలు పట్టాలు విరిగిపోవడమే జరుగుతుంది. ఇటువంటి సమయాల్లో లైన్ మెన్ లు చేసే డ్యూటీనే అనేక మంది ప్రాణాలు కాపాడుతుంది. ఒక్కోసారి డ్రైవర్ అప్రమత్తత, చాకచక్యం కూడా ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుంది. వీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వందల మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. నిత్యం అప్రమత్తంగా ఉంటూ వారు చేసే డ్యూటీనే ప్రయాణికులకు శ్రీరామరక్షగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: