తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ వలన మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. గడచిన 7 రోజుల్లో 10 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోకుండా అపహస్యం చేస్తోందని అన్నారు. 
 
వైసీపీ పార్టీ నాయకుల భాద్యతా రాహిత్యానికి ఇంకెంతమంది భవన నిర్మాణ కార్మికులు బలి కావాలని చంద్రబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు గుర్రం నాగరాజు అనే 35 సంవత్సరాల వయస్సు గల భవన నిర్మాణ కార్మికుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో నివసించే నాగరాజుకు ఇసుక కొరత వలన గత కొన్ని నెలల నుండి ఉపాధి లభించటం లేదు. 
 
నాగరాజు భార్య వాణి ఒక భవనానికి వాచ్ మెన్ గా పని చేస్తూ ఉండగా నాగరాజు తాపీ పని చేస్తూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడ్డాయి. నాగరాజు ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
వైసీపీ మంత్రి కన్నబాబు ఇసుక కొరత గురించి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ ఇసుక కొరత గురించి కావాలని రాజకీయం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలుసని, ఇసుక దోపిడీ అరికట్టేందుకే కొత్త పాలసీ తెచ్చామని అన్నారు. చంద్రబాబు అజెండాను అమలు చేయటం కోసమే పవన్ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని కన్నబాబు అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని కన్నబాబు అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: