ఈరోజు 3 గంటలకు మొదలైన తెలంగాణ కేబినేట్ సమావేశం కొనసాగుతోంది. నెలరోజులుగా డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు సమ్మెను ఉపసంహరించేది లేదని ఆర్టీసీ కార్మికులు చెబుతూ ఉండటంతో కేబినేట్ భేటీలో ఆర్టీసీ కార్మికుల గురించి సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ అటు ఆర్టీసీ కార్మికుల్లో ఇటు తెలంగాణ ప్రజల్లో నెలకొంది. ఆర్టీసీ రూపురేఖలు మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ విధానం ఇక ఉండటానికి వీలులేదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రెండు మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈరోజు కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో ఆర్టీసీకి సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తిగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలా...? రీజియన్ల వారీగా ఆర్టీసీని విభజించే అంశానికి సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి...? ఈ రెండు ప్రతిపాదనలలో సీఎం కేసీఆర్ రెండవ ప్రతిపాదనకే  మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీని మూడు రీజియన్లుగా విభజించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. యాజమాన్యం తరపున బస్సులు, ప్రైవేట్ బస్సులు, అద్దె బస్సుల గురించి కూడా అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర చట్టాన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో ఆర్టీసీ కార్మికులకు షాక్ మాత్రం తప్పదని తెలుస్తోంది. 
 
ఆర్టీసీని రెండు మూడు విభాగాలుగా విభజించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కార్మికులు ఈ విషయంలో ఆందోళన పడవద్దని జేఏసీ నేతలు చెబుతున్నారు. కార్మికులు కూడా ఎక్కడా తగ్గటం లేదని స్పష్టంగా తెలుస్తోంది. జేఏసీ నేతలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి తీసుకొని వెళ్లాలని అమిత్ షాను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించాలనే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: