జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పవన్ స్టార్‌ నుంచి మీరు ప్యాకేజీ స్టార్‌ గా మారిపోయారని వైఎస్‌ఆర్‌ సిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ విమర్శించారు. దీనిపై గత ఎన్నికల్లోనే పవన్‌ కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు, పవన్‌ కళ్యాణ్ సినిమాల్లో నటించేప్పుడు అనేక బ్యానర్లు, ప్రోడక్షన్‌ లలో పని చేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఒకటే బ్యానర్ ను ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. నారా వారి ప్రోడక్షన్‌ లోనే ఆయన ప్యాకేజీలు నడుస్తున్నాయని ఆరోపించారు. మీరు సినిమాలు ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదని పవన్ ను ఉద్ద్యేశించి  వ్యాఖ్యానించారు. మీ కాల్ షీట్ ల కోసం పెద్ద పెద్ద ప్రోడ్యూసర్లు తిరుగుతున్నారు. అయినా సినిమాలను వదులుకున్నారంటే. చంద్రబాబు ఇచ్చే కాల్షీట్లు, రెమ్యునరేషన్‌ ఎక్కువ కాబట్టే అని అర్ధం అవుతోందన్నారు. ప్యాకేజీల కోసం ఇంతగా దిగజారిపోతారా? చంద్రబాబు ట్రాప్‌ లో పడిపోతారా అని నిలదీశారు. మీరు చంద్రబాబుతో చేసుకుంటున్న రహస్య ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు. లాంగ్ మార్చ్ పోరాటాల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ మీది షార్ట్ మార్చే అని అన్నారు. మీరు తీసుకునే నిర్ణయాల మీద మీకు వున్న నిబద్దత ప్రజలకు తెలుసు అన్నారు. చంద్రబాబుతో కలిసి పవన్‌ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.



ఇసుకకు సంబంధించి ఈ రాష్ట్రంలో తాత్కాలిక ఇబ్బంది వుంది అనేది అందరికీ తెలిసిందే. దానికి కారణాలు ఏమిటీ అనేది ప్రతిపక్ష పార్టీలకి అర్ధం కాకపోవడం బాధాకరమన్నారు. కృత్రిమంగా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించదనే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలోని నదులు ఏ రకంగా ప్రవహిస్తున్నాయో ప్రజలకు తెలుసు అని అన్నారు.  పొంగిప్రవహిస్తున్న నదుల నుంచి ఇసుకను తవ్వి తీయడం సాద్యం కాదని ప్రజలకు కూడా  తెలిసిన విహాయమేనన్నారు. ఒక్కసీటు గెలిచిన చిన్నపిల్ల సేనకు, ఇరవై మూడు సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల దేశంకు ఈ విషయం తెలియడం లేదా అని ప్రశ్నించారు. ఇసుక కోసం అంటూ పవన్‌ లాంగ్ మార్చ్ కు పిలుపు నిచ్చారు.  ఇసుకను జాతీయ సమస్యగా చిత్రీకరించి, రాజకీయంగా లబ్దిపొందాలని చూడటం బాధాకరం. ఈ రాష్ట్రంలో జగన్‌ ముఖ్యమంత్రి అయితే నా పేరు పవన్‌ కళ్యాణ్‌ కాదు అని బహిరంగంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  వైఎస్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి సిఎం అవ్వడం కల అని కూడా పవన్‌ కళ్యాణ్ చెప్పారన్నారు. మరి పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు తన కొత్త పేరు ఎప్పుడు చెబుతారని నిలదీశారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తిగా... తన పుస్తకాల్లోని మంచి పేరును ఆయన ఎప్పుడు పెట్టుకుంటారని ప్రశ్నించారు.



మీ పేరు నారా పవన్‌ కళ్యాణ్‌ అని మార్చుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. విశాఖలో లాంగ్ మార్చ్ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారని నిలదీశారు. రేపు జరిగే లాంగ్ మార్చ్ జనసేనకు లాస్ట్ మార్చ్ అవుతుందన్నారు. ఎన్నికల్లో పరాజయం చెందిన తరువాత గాజువాక ప్రజలకు కనీసం ఏ ఒక్కరోజు అయినా కృతజ్ఞతలు తెలిపారా అని ప్రశ్నించారు. జనసేన ఎందుకు ఓడిందనే సమీక్షా సమావేశం ఏనాడైనా విశాఖలో పెట్టారా అని ఎమ్మెల్యే గుడివాడ నిలదీశారు. ఈ సమావేశం పెట్టి వుంటే.. మీ పార్టీ పరిస్థితి ఏమిటో తెలిసేదనన్నారు. విశాఖ జిల్లాకు చెందిన కీలకనేత బాలరాజు జనసేనను వదులుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయన్నారు. మీ సైన్యం జారిపోతున్నా...పట్టించుకోకుండా... మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబే ఆరోపించారు. ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని వర్గాలకు వైఎస్‌ఆర్ సిపి ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు.



అన్ని రకాలుగా వారిని ఆదుకుంటోందన్నారు. ఒక్క ఎపిలోనే కాకుండా పక్కరాష్ట్రాల్లో కూడా ఆరోగ్య శ్రీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. మీరు ఉద్దానం... ఉద్దానం అని తిరిగి ఏం ఉద్దరించారని చెప్పారు. అటువంటి ఉద్దానంకు వైఎస్‌ జగన్‌ సిఎం అయిన యాబై రోజుల్లోనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. డయాలసిస్‌ పేషంట్లకు పెన్షన్లను ప్రకటించారు. కేవలం రాజకీయ లబ్దికోసమే మీరు లాంగ్ మార్చ్ అంటున్నారు. గత అయిదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు టిడిపి నుంచి లాంగ్ మార్చ్ లో పాల్గొంటున్నారు. ఇసుక మాఫియా డాన్ అచ్చెన్నాయుడు, డ్రగ్‌ మాఫియా డాన్‌ అయ్యన్నపాత్రుడు, లిక్కర్ మాఫియా డాన్‌ లను పక్కన పెట్టుకుని లాంగ్ మార్చ్ చేస్తారా అని ప్రశ్నించారు. మహనీయుల పేర్లు చెబుతారు... గొప్ప పుస్తకాలు చదివానంటారు. మీరు చేసే పనులకు వీటికి ఏమైనా పొంతన వుందా పవన్‌ కళ్యాణ్‌ అని నిలదీశారు. ప్రకృతి వైఫరిత్యం వల్ల ఇసుక సమస్య ఏర్పడిందన్నారు.




వర్షాల వల్ల నదులు నిండు కుండల్లా ఉన్నాయన్నారు. నదుల నుంచి ఇసుకను తీయలేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే బాధతో మేం వున్నామని చెప్పారు. ఉన్న రీచ్ లలో ప్రస్తుతం ఇరవై శాతం రీచ్ లలోనే ఇసుకను తవ్వితీస్తున్నారు. ఇది శాశ్వతంగా వుండే సమస్య కాదు. తాత్కాలిక సమస్య మాత్రమేనన్నారు. చంద్రబాబు ఉస్కో అంటే...పవన్‌ ఇసుకో అని అంటున్నాడని వ్యాఖ్యానించారు. లాంగ్ అనే మాటను పవన్ కళ్యాణ్ విరమించుకోవాలన్నారు. సినిమాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ లాంగ్ మీకు నచ్చదు. ఇసుక విషయంలో లాంగ్ అనే పదం ఎందుకు వచ్చిందో మాకు అర్ధం కావడం లేదన్నారు.  ప్రతిపక్షంగా అర్థవంతమైన విమర్శలు చేస్తే స్వీకరించేందుకు సిద్దంగా వున్నామని సిఎం  వైఎస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో కలిసి చేసే ఇటువంటి బురద జల్లుడు పనులను మానుకోండని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: