రాష్ట్రంలో ఇసుక సమస్యపై పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలే టాప్ సినీ స్టార్ కావడంతో పవన్ పిలుపుకు పార్టీ కార్యకర్తలే కాకుండా మెగా అభిమానులు కూడా భారీగా హాజరవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర చిరంజీవి యువత నుంచి అభిమానులకు పిలుపు వెళ్లిపోయింది. అందరూ విశాఖ చేరుకుంటున్నారు. ‘చలో విశాఖ’ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

 

 

అయితే పవన్ లాంగ్ మార్చ్ కు మీడియా ఎంతవరకూ సహకరిస్తుందనే ప్రశ్న ఉంది. గతంలో ఇదే విశాఖలో ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ర్యాలీని ఏ మీడియా కూడా కవరేజ్ చేయలేదు. వార్తల్లో ఓ అర నిమిషం చూపిస్తే గొప్ప. అప్పటి సీఎం చంద్రబాబు కనుసన్నల్లో నడిచే మీడియా సంస్థలు అప్పట్లో పవన్ కార్యక్రమాన్ని చూపలేదు. దీనిపై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు పవన్ లాంగ్ మార్చ్ కు మద్దతు ప్రకటించడమే కాకుండా టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఇందులో ఎంత రాజకీయ కోణం ఉందో అర్ధమవుతోంది. అప్పట్లో ప్రత్యేక హోదా ఉద్యమానికి టీడీపీ వ్యతిరేకం కాబట్టి మీడియా సంస్థలు పవన్ ను పట్టించుకోలేదు. ఇప్పటి లాంగ్ మార్చ్ కు టీడీపీ అనుకూలం కాబట్టి రేపు అదే బాబు అనుకూల మీడియా లైవ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

 

కొసమెరుపు ఏంటంటే.. అప్పటి పోరాటం రాష్ట్రం కోసం, ఇప్పటి పోరాటం భవన నిర్మాణ కార్మికుల కోసం. రెండూ ప్రజల పక్షాన నిలిచే పోరాటాలే. కాకపోతే ప్రభుత్వం మారిపోయింది. పవన్ మాత్రం ఎప్పటిలా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అప్పట్లో సహకరించని టీడీపీ ఇప్పుడెందుకు మద్దతిస్తుందో, ఇప్పుడు టీడీపీ మద్దతు పవన్ ఎందుకు కోరాడో.. ఎవరికీ అర్ధం కాని ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: