ఆర్టీసీని 20 శాతం  ప్రయివేటీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హుంకరిస్తున్న ఆ పప్పులేమి ఉడకవని అటు బీజేపీ నేతలు , ఇటు కార్మిక సంఘాల జెఎసి నేతలు అంటున్నారు . ఆర్టీసీ లో కేంద్రం వాటా 31  శాతం ఉన్నదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు . అటువంటప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఎలా ప్రయివేటీకరిస్తారని ప్రశ్నించారు . ఆర్టీసీ ప్రయివేటీకరణ గురించి కేంద్ర వెహికల్ చట్టం గురించి ఎక్కడ లేదని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత ఇంద్ర సేనారెడ్డి అన్నారు .


ఆర్టీసీ సమ్మె  గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు . ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టడానికి ముఖ్యమంత్రి , ప్రయివేటీకరణ మంత్రం జపిస్తున్నారని విమర్శించారు . అయినా ఆర్టీసీని ప్రయివేటీకరించే  అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు . ఆర్టీసీ ఇంకా రెండుగా విడిపోలేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు . రాష్ట్ర విభజన చట్టం లోని 9 -10  షెడ్యూల్ లో ఉన్న సంస్థల విభజన ఇంకా జరగలేదని గుర్తు చేస్తున్నారు . ఆర్టీసీ కూడా 9 -10 షెడ్యూల్ లో ఉందన్న విషయాన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలని అంటున్నారు . ఉమ్మడి ఆర్టీసీ ఎక్కడి ఆస్తులు అక్కడే , ఎక్కడి కార్మికులు అక్కడేనన్న ప్రాతిపదికపై విభజన జరిగిందని , అంతేకాని ఎటువంటి ఉత్తర్వులు , గెజిట్ విడుదల చేయలేదని కార్మిక సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు .


టీఎస్ ఆర్టీసీగా విడిపోయినా, ఇంకా నిబంధలు ప్రకారం తాము ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులమేనని వారు పేర్కొంటున్నారు . ఒకవేళ ఆర్టీసీ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకోవచ్చునని , కానీ కేసీఆర్ కు ఆ అధికారం లేదని అంటున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: