తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినేట్ భేటి అనంతరం మాట్లాడిన తీరు పై కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన ఏమన్నారంటే…సీఎం కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ఆర్టీసి కార్మికుల  పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు.

నిజాం పాలన ఎలా ఉంటుందో చూడలేదు కానీ ఈయన మాత్రం మరో నిజాంను తలపిస్తున్నారు. ప్రజలకు మరో నిజాం నవాబు పాలన చూయిస్తున్నాడు. కార్మికులు పిట్టల్లా రాలుతున్నా కనీసం వారి గురించి మాట్లాడలేదు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడు. మీరు చస్తే చావండి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా అనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. ఇదే ఫైనల్ అంటూ శాసిస్తున్నాడు. 


ఈ దొర రాజుల కాలం అనుకుంటున్నాడేమో. ఇది ప్రజాస్వామ్యమన్న విషయాన్నే మరిచాడు. ఆర్టీసి కార్మికులు ఏమైనా ఆస్తులు అడిగారా. విలీనం చేయమని కోరితే ఇంత రాద్దాంతం చేయడం అవసరమా. పక్క రాష్ట్రంలో విలీనం సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు కాదు. ఆర్టీసి ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. ఆర్టీసిని అమ్మేందుకు రంగం సిద్దం చేశాడు. అందుకే ఇంత మొండి వైఖరీగా ప్రవర్తిస్తున్నాడు. సంఘం ఆయనకు అనుబంధంగా పని చేసినప్పుడు, ఆయన అల్లుడు హారీష్ రావు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు మంచివాళ్లు అయిన కార్మికులు ఇప్పుడు చెడ్డగా ఎందుకు కనిపిస్తున్నారు. 


కోర్టులంటే ఆయనకు అసలు గౌరవం లేదు. కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నాడు. కార్మికుల పై బ్లాక్ మెయిలింగ్ అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. డెడ్ లైన్ లోపు చేరకుంటే డిస్మిస్ చేస్తా అంటున్నాడు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించదు. ఇప్పటికే ప్రజలు రగిలిపోతున్నారు. ఒక్క క్షణం కూడా కేసీఆర్ ను భరించేందుకు ప్రజలు సిద్దంగా లేరు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మరో ఉద్యమం రావాల్సిన సమయం ఆసన్నమైంది.” అని రేవంత్ రెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: