ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ గత ముప్పై రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  కార్మికులు సమ్మె చేస్తున్నా.. సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.  ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కక పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  అయినప్పటికీ ప్రభుత్వం దిగిరావడం లేదు.  


పైగా ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబసభ్యులు అని కెసిఆర్ చెప్పడం వెనుక అర్ధం ఏంటో అర్ధంకావడం లేదు.  కడుపు కాలే వరకు ఊరుకుంటే వాళ్ళే వచ్చి ఉద్యోగాల్లో చేరుతారేమో అనుకుంటున్నారు.  అది ఎంతవరకు సఫలం అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.  కష్టంగా ఉన్నా సమ్మె మాత్రం విరమించేది లేదని, తమ ఉద్యోగాలు ఎక్కడికి పోవని, సమస్యలు పరిష్కారం కాకుండా తిరిగి ఉద్యోగాల్లో చేరితే.. ఎప్పటికి సమస్యలు పరిష్కారం కావని ఆర్టీసీ జేఏసీ నాయకులు అంటున్నారు.  


ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయామనే బాధతో అనేకమంది మరణిస్తున్నారు.  ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు మరణిస్తున్నారు.  కానీ, ప్రభుత్వం మాత్రం దిగిరావడం లేదు.  అసలు దీనిపై కమిటీ వేసి వేసి సమస్యలకు మార్గం సుగమం చేయాలని జేఏసీ అంటోంది.  అటు హైకోర్టు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టింది.  ఆర్టీసీ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని, గత 30 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు పేర్కొంది.  


ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో రేపటి నుంచి సమ్మెను మరింతగా ఉదృతం చేయబోతున్నారు.  సోమవారం అన్ని డిపోల దగ్గర విపక్ష నేతలతో కలిసి ధర్నాలు చేపట్టనున్నారు.  నవంబరు 5న సడక్‌ బంద్‌లో భాగంగా రహదారుల దిగ్బంధం, 6న కుటుంబ సభ్యులతో కలిసి డిపోల వద్ద నిరసన తెలియజేయనున్నారు. నవంబరు 7న అన్ని ప్రజా సంఘాలతో నిరసన ప్రదర్శనలు, 8న చలో ట్యాంక్‌బండ్‌ సన్నాహాక కార్యక్రమాలు, 9న చలో ట్యాంక్‌బండ్‌, రెండు గంటలపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆర్టీసీ జేఏసీ తెలియజేసింది.  ప్రగతిరథం పరుగులు తీయకపోవడంతో.. ఆర్టీసీ ఆదాయానికి భారీ నష్టం వస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: