పవన్ కళ్యాణ్ విశాఖలో ఇసుక కొరతపై ఏర్పాటు చేసిన లాంగ్ మార్చ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ లాంగ్ మార్చ్ కు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు పవన్ కళ్యాణ్ నడిచి వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు.  దీంతో పవన్ తన కారులోనే లాంగ్ మార్చ్ లో పాల్గొనాల్సి వచ్చింది.  సభకు దగ్గరకు వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడారు.  


పవన్ కళ్యాణ్ ఇసుక కొరత ఉంటె రాష్ట్రం అభివృద్ధి చెందటం కష్టం అని... రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే.. తప్పనిసరిగా నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలి.  నిర్మాణాలు చురుగ్గా జరుగుతుంటేనే.. కొత్త కొత్త కంపెనీలు.. కొత్త కొత్త నిర్మాణ సంస్థలు పెట్టుబడులు పెడతాయని అందరిని తెలిసిందే.  కానీ, గత కొంతకాలంగా రాష్ట్రంలో నిర్మాణాలు చురుగ్గా సాగడం లేదు.  ఇసుక కొరత కారణంగా ఈ నిర్మాణాలు నిలిచిపోయాయి.  


దీంతో పవన్ కళ్యాణ్ విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ ను నిర్వహించారు.  ఈ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ గా మాట్లాడారు. తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె విషయంలో అన్ని పార్టీలు కలిసి వచ్చి ఫైట్ చేస్తుంన్నాయని,  అక్కడి పార్టీలన్నీ కూడా కులాలకు అతీతంగా ఒక్కటే అజెండాతో పోరాటం చేశాయని, కానీ, ఆంధ్రప్రదేశ్ లో కులం ప్రాతిపదిక మీదనే రాజకీయం నడుస్తోందని ఇది మారాలని పవన్ చెప్పారు.  


కులరాజకీయాలను ఎప్పుడైతే నాయకులు పక్కన పెడతారో అప్పుడే రాష్ట్రం ముందుకు వెళ్తుందని పవన్ పేర్కొన్నారు.  భవన నిర్మాణ కార్మికులు నా కులం వాళ్లా? కులాలను దాటి ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.  భవన నిర్మాణ కార్మికుల సమస్యలపట్ల సంఘీభావం తెలిపిన బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.  


భవన నిర్మాణ కార్మికుల విషయంలో ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు.  ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ. 50 వేలు పరిహారం  నష్టపరిహారం చెల్లించాలని, చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. రెండు వారాల్లో ప్రభుత్వం నుంచి  ఏ స్పందనా లేకపోతే నేను అమరావతి వీధుల్లో నడుస్తానని పవన్ చెప్పారు.  పోలీసులను పెట్టి ఆపాలని చూసినా ఆగేది లేదని, ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్టు పవన్ తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: