తిరుమలలో గత కొన్ని రోజులుగా విజిలెన్స్ అధికారులు దళారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈరోజు వసతి గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న దుర్గా కిరణ్ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీలో పనిచేసే ఏడుగురు ఉద్యోగులు దళారీ దుర్గా కిరణ్ కు సహకరిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దుర్గా కిరణ్ కు సహకరించిన అధికారులలో ఏఈవో స్థాయి నుండి అటెండర్ స్థాయి వరకు ఏడుగురు ఉన్నారని తెలుస్తోంది. 
 
దుర్గా కిరణ్ ఆన్ లైన్ ద్వారా టీటీడీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పోలీసులు టీటీడీ ఉద్యోగులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలో దళారీ వ్యవస్థను రూపు మాపడమే లక్ష్యమని చెప్పారు. నాలుగు రోజుల క్రితం తిరుమల టూ టౌన్ పోలీసులు నలుగురు దళారులను అరెస్ట్ చేశారు. 
 
తిరుపతికి చెందిన వీరాచారి, రిపోర్టర్ తోట వెంకటేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కృష్ణ, తిరుపతికి చెందిన ఉమా శంకర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులతో సిఫారసు లేఖలను తీసుకొని భక్తులకు అధిక ధరలకు విక్రయించి నలుగురు పంచుకునేవారని పోలీసుల విచారణలో తేలింది. విజిలెన్స్ అధికారులు గత నెల 21వ తేదీన ఒక ఎమ్మెల్యే పేరుపై తీసుకున్న టికెట్ అధిక ధరలకు దళారులు అమ్మినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకొని నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పోలీసులు భక్తులకు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. భక్తులు దళారీ వ్యవస్థను అరికట్టేందుకు సహకరించాలని పోలీసులు కోరారు. విజిలెన్స్ అధికారులు దళారులపై దృష్టి పెట్టటంతో అతి త్వరలో తిరుమలలో దళారుల కథ ముగిసిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: