రాబోయే సంక్రాంతికి ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలియచేసారు. ది స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్థానిక రెవెన్యూ భవన్‌లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి, అవినీతిని నిర్మూలించి, జవాబుదారీతనం పెంచుతామని తెలిపారు . విద్యాశాఖలో ఐదేళ్లలో చేయాల్సిన పనులు ఐదు నెలల్లో చేశామని పేర్కొన్నారు. ప్రధానంగా విద్యాశాఖలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతూ ఫీజురెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.


ఇక  అన్ని డిఇఒ కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు స్వస్థి పలికి, ఈఫైలింగ్‌ విధానం అమలు చేస్తామని తెలియచేయడం జరిగింది. డిఇఒ పోస్టులను ఇతర శాఖల మాదిరిగానే జెడి స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన హెచ్‌ఎంల పదోన్నతులు, భాషా పండితుల అప్‌గ్రేడేషన్‌ కౌన్సెలింగ్‌లో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ అమలు చేస్తామన్నారు. 


ఉపాధ్యాయులకు, విద్యాశాఖ ఉద్యోగులకు మధ్య సమన్వయం పాటిస్తూ విద్యాభివృద్ధికి కృషిచేస్తామన్నారు. పదోన్నతులన్నీ కింది స్థాయి ఉద్యోగులతో భర్తీ చేస్తామని, ఇతర శాఖల పెత్తనాన్ని ఈ శాఖపై నిరోధిస్తాము అని తెలిపారు. ఇప్పటికే ఈ శాఖలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న వారిని వెనక్కి పంపించి, మాతృశాఖ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది  అని తెలిపారు. సమగ్ర శిక్షలో డిఇఒలను చీఫ్‌ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించామన్నారు. విద్యాశాఖను సమగ్రంగా అభివృద్ధి చేయటానికి శాశ్వత ప్రాతిపదికన విధానాలు రూపొందించి అమలు చేస్తామన్నారు.


సమావేశంలో ఉద్యోగులకు డిస్టెన్స్‌ ద్వారా బి.ఇ.డి చేయటానికి అవకాశం ఇవ్వాలని పలు తీర్మానాలను సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌ఎస్‌.గంగా భవానీ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ జిల్లా అధికారి పిల్లి రమేష్‌, అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.స్వాములు, పి.వెంకటేశ్వరరావు, కోశాధికారి రాజేంద్రప్రసాద్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యం.వెంకటప్పయ్య, యం.వరప్రసాద్‌ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: