దేశరాజధాని ఢిల్లీ ప్రశాంతంగా ఉంటేనే దేశంలోని మిగతా నగరాలు, ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటాయి.  అక్కడ ఏదైనా అలజడి జరిగింది అంటే.. దానికి సంబంధించిన ప్రభావం దేశం మొత్తం వ్యాపిస్తుంది.  ఇది దేశానికీ, రాష్ట్రాలకు కూడా మంచిది కాదు.  చట్టాన్ని, న్యాయాన్ని కాపాడేది ఎవరు అంటే లాయర్లు, పోలీసులు అని చెప్తారు.  ఇద్దరి మధ్య ఒక సరైన అవగాహనా ఉన్నప్పుడే తప్పు చేసిన వ్యక్తులకు శిక్ష పడుతుంది.  మంచికి న్యాయం జరుగుతుంది.  


అలా కాకుండా ఇద్దరి మధ్య అవగాహనలు లేకుండా.. ఇద్దరు శత్రువుల్లా కత్తులు దూసుకుంటే.. సామాన్యులకు న్యాయం ఎక్కడ ఉంటుంది.  వీధి రౌడీల్లా వీధుల్లో కొట్లాటలకు దిగితే ఇంకేమన్నా ఉన్నదా చెప్పండి.  న్యాయం ధర్మం రెండు మంటగలిసి పోతాయి.  ఇలాంటి సంఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది.  లాయర్లు.. పోలీసులు ఇద్దరు కోర్టు సాక్షిగా బహిరంగంగా బాహాబాహిలకు దిగారు.  


కొట్టుకున్నారు.  ఈ కొట్లాటతో పోలీసులకు, లాయర్లుకు గాయాలయ్యాయి.  ఈ గొడవను కోర్టు సుమోటోగా తీసుకొని పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.  అయితే, లాయర్ల విషయంలో కోర్టు ఎలాంటి చురకలు అంటించకపోవడంతో పోలీసులకు కోపం వచ్చింది.  పార్కింగ్ విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు ఢిల్లీ మొత్తాన్ని అట్టుడికిస్తోంది.  ప్రజలను రక్షించే పోలీసులకే రక్షణ లేదని అంటూ పోలీసులు పోలీస్ కమీషనర్ ఆఫీస్ ముందు నినాదాలు చేశారు.  


పోలీసులు భారీ సంఖ్యలో కదిలిరావడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది.  పైగా లాయర్లు కొందరు పోలీస్ కానిస్టేబుల్ పై చేయి చేసుకుంటున్న వీడియో బయటకు రావడంతో ఈ విషయం మరింత సీరియస్ అయ్యింది.  భారీ సంఖ్యలో పోలీసులు కమీషనర్ ఆఫీస్ ముందుకు వచ్చి నినాదాలు చేశారు.  పోలీసులకు అన్యాయం జరుగుతుంటే పోలీస్ కమిషనర్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారని, పోలీస్ కమీషనర్ అంటే కిరణ్ బేడీలా ఉండాలని అంటూ నినాదాలు చేశారు.  ఈ విషయం ఎంతదూరం వెళ్తుందో.. దేశంలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: