ఏపీలో రెండు రోజులుగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఈ బదిలీకి మతం రంగు పులుముకుంటోంది. ఐవైఆర్ కృష్ణారావు వంటి వారు.. క్రిస్టియన్లను టీటీడీ నుంచి పంపించే జీవో విడుదల చేసినందుకే ఎల్వీపై బదిలీ వేటుపడిందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు.


ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు తోడు రంగంలోకి క్రిస్టియన్ సంఘాలు కూడా దిగాయి. అంతకు ముందు ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న జెరూసలేం మత్తయ్య దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఎల్వీ బదిలీకి సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన కేట్ కట్ చేసి దాన్ని ప్రచారంగా మలచుకుంటున్నారు. విజయోత్సం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు.


వాస్తవానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పట్లో జీవో ఇచ్చింది ఆయన వ్యక్తిగతంగా కాదు. అసలు అలాంటి జీవోలు మంత్రికీ, ముఖ్యమంత్రికీ తెలియకుండా సీఎస్ నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాల్లో భాగంగా ఏపీలో మరోసారి మతం మంటలు అంటుకునే ప్రమాదం ఉంది.


మొత్తం మీద ప్రశాంతమైన రాష్ట్రంలో మతం రంగు పులుముతూ రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పుకునేందు కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు వ్యవహరించడం రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. మొన్నటి దాకా విభజన ఉద్యమాలు.. ఇప్పుడు.. మతవ్యవహారాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు కాకుండా తిరోగమనం వైపు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో రాజకీయ పార్టీలు కూడా కాస్త సంయమనం పాటించడం రాష్ట్ర శ్రేయస్సుకు ఎంతో మంచిది. కానీ ఇలాంటి మంచి మాటలు చెవిన పెట్టుకునే నాయకులు ఆంధ్ర ప్రదేశ్ లో ఎందరు ఉన్నారు కనుక.


మరింత సమాచారం తెలుసుకోండి: