పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం వెలుగు చూసింది. సింహాద్రి అలియాస్ శివ అనే వ్యక్తి ప్రసాదంలో సైనేడ్ కలిపి 10మందిని హత్య చేశాడు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నివశించే 10 మందిని ప్రసాదంలో సైనేడ్ కలిపి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. సింహాద్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఆ తరువాత ఇతరుల నమ్మకాలు, బలహీనతలను సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో మోసాలకు పాల్పడేవాడు. 
 
బంగారం రెట్టింపయ్యే మార్గం, గుప్త నిధులు, రంగు రాళ్లు, రైస్ పుల్లింగ్ కాయిన్ అంటూ అప్పుల నుండి బయటపడాలనుకునేవారిపై, బాగా డబ్బున్నవారిపై కన్నేశాడు. మొదట సొంత బంధువులను టార్గెట్ చేసిన సింహాద్రి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పేవాడు. రంగు రాళ్లు, రైస్ పుల్లింగ్ కాయిన్ ఉపయోగిస్తే సంపద రెట్టింపు అవుతుందని మాయ మాటలు చెప్పి కొంత నగదును వసూలు చేసేవాడు. 
 
కొన్ని రోజుల తరువాత సింహాద్రి ఇచ్చిన వస్తువుల వలన ఎలాంటి ఫలితం లేదని ఎవరైనా చెబితే ప్రసాదంలో సైనేడ్ కలిపి ఆ వ్యక్తులకు ఇచ్చి హతమార్చేవాడు. ఆ తరువాత ఆ వ్యక్తుల ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకొని పరారయ్యేవాడు. అలా 2018 ఫిబ్రవరి నెల నుండి 2019 అక్టోబర్ నెల వరకు 10 మందిని హతమార్చాడు. అక్టోబర్ నెలలో ఏలూరులో పీఈటీ నాగరాజు హత్యకు గురయ్యాడు.  
 
ఇంటి నుండి డబ్బు, నగదుతో వెళ్లిన నాగరాజు మృతదేహం దగ్గర డబ్బు, నగదు కనిపించకపోవటంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చనిపోయిన పీఈటీ నాగరాజు సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడు సింహాద్రిని గుర్తించారు. సింహాద్రి మోసాలకు పాల్పడి 28 లక్షల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. సింహాద్రి దగ్గర నుండి పోలీసులు 23 కాసుల బంగారు ఆభరణాలు, 1,63,400 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: