తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు హడలి పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం లోనే కాకుండా , పొరుగునే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఈ సంఘటన ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు కన్పిస్తోంది . విజయారెడ్డి సజీవ దహన ఘటన అనంతరం  కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్‌ ఉమామహేశ్వరి తన చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి.. అర్జీలు ఇచ్చేవారు ఎవరైనా తాడు బయట నుంచే ఇవ్వాలని, లోపలికి ఎవర్నీ అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు.


తహసీల్దార్‌ హడావుడి చూసి కార్యాలయ సిబ్బందితో పాటు వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై తహసీల్దార్‌ను విలేకరులు వివరణ అడగ్గా.. ‘మా జాగ్రత్త మేం తీసుకోవాలి కదా’  అంటూ సమాధానమిచ్చారు . విజయారెడ్డి సజీవ దహన ఘటన ను నిరసిస్తూ తెలంగాణ రెవిన్యూ ఉద్యోగులు మూడు రోజుల పాటు  విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు . ఇక విజయారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న రెవిన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం హాట్ టాఫిక్ గా మారింది .


రెవిన్యూ ఉద్యోగుల పట్ల ప్రజల్లో ద్వేషం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని రెవిన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు . అయితే రెవిన్యూ ఉద్యోగుల అవినీతి కూడా పరాకాష్ట కు చేరినట్లు భువనగిరి -యాదాద్రి జిల్లా పరిధిలోని గుండాల మండల కేంద్రం లో జరిగిన సంఘటన స్పష్టం చేస్తోంది .విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవిన్యూ సిబ్బంది కార్యాలయ ఆవరణ లో బైఠాయించి నిరసన తేలుతుపుతున్న సమయం లో అక్కడికి ఒక మహిళ   చేరుకొని పాస్ బుక్ ఇప్పిస్తానని రెండువేలు లంచం తీసుకున్న విఆర్వో ను ఉద్దేశించి తన రెండు వేలు తనకు ఇచ్చేయాలని , లేకపోతే గళ్ళపట్టుకుని నిలదీస్తానని హెచ్చరించడం తో , నిరసన తెలుపుతున్న సిబ్బంది అక్కడి నుంచి నిష్క్రమించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: