కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్ డిపోలో కరీంఖాన్ మెకానిక్ గా పనిచేసేవాడు. మూడు రోజుల క్రితం కరీంకు గుండెపోటు రాగా కరీంను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఈరోజు ఉదయం కరీం మృతి చెందాడు. కరీంనగర్ జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు నిరసన, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఆర్టీసీ కాలనీలో కరీం తన కుటుంబసభ్యులతో కలిసి నివశించేవాడు. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జీతాలు అందక కార్మికుడు కరీం మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. కరీం మృతితో కరీంనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసేసరికి 26 మంది కార్మికులు మాత్రమే కరీంనగర్ డిపో నుండి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారని సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 33వ రోజుకు చేరింది. 
 
ఆర్టీసీ కార్మికులు కరీం ఇంటివద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. విపక్ష పార్టీ నేతలు కరీం నివాసానికి చేరుకొని కరీంకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకోగా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరవక ముందే మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. 
 
చనిపోయిన ఇద్దరు కరీంనగర్ కార్మికుల స్వస్థలం ఆరేపల్లి కావడం గమనార్హం. కరీం గుండెపోటుతో చనిపోవటంతో ఆరేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. సీపీఐ నేతలు కరీంకు నివాళులు అర్పించారు. సీపీఐ నేతలు కరీంఖాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళనను మరింత ఉధృతం చేయబోతున్నట్లు ప్రకటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: