అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి సజీవ దహన ఘటన ను స్ఫూర్తిగా తీసుకున్నాడేమో ఆ రైతు పంచాయితీ కార్యదర్శిని చంపి తాను చనిపోతానంటూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేయగా , పక్కనే ఉన్న వారు అడ్డుకున్నారు . దీనితో  శ్రీకాకుళం జిల్లా నరసన్నపాడు మండల పరిధిలోని దుకాలపాడు గ్రామం లో నిర్వహించిన రైతుభరోసా, గ్రామసభ  కార్యక్రమం లో కలకలం రేగింది .


 సభకు విచ్చేసిన  జగన్మోహన్ రావు అనే రైతు , పంచాయితీ కార్యదర్శిని సుమలత పై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన పొలంలో మురికి కాలువ నిర్మించి , తనకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తావా అంటూ మండిపడుతూ... నిన్ను పెట్రోల్ పోసి చంపేస్తా .. నేను పెట్రోల్ పోసుకుంటానని చెప్పి తన వెంట బ్యాగ్ లో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను బయటకు తీసి తన ఒంటిపై పోసుకోబోగా, పక్కనే ఉన్నవారు అడ్డుకున్నారు . అయితే ఈ క్రమం లో అధికారులపై పెట్రోల్ పడగా , అగ్గిపుల్ల తీసేందుకు జగన్మోహన్ రావు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు .


ఈ ఘటన తో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన మహిళా అధికారులు , వాలంటీర్లు పరుగు అందుకున్నారు . సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు జగన్మోహన్ రావును అదుపులోకి తీసుకున్నారు . ఈ ఘటన అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది . రక్షణ కల్పించలేకపోతే విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .


తహశీల్ధార్ విజయారెడ్డి ని సురేష్ అనే రైతు తమ భూమి  పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదనే నెపం తో కార్యాలయం లోనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మరిచిపోకముందే చోటు చేసుకున్న ఈ పరిణామం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది .


మరింత సమాచారం తెలుసుకోండి: