రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో సోమవారం రోజు తహశీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించి దాడి చేసిన విషయం తెలిసిందే. నిందితుడు సురేశ్ నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు సురేశ్ భార్య ఈ కేసులో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన భర్త సురేశ్ తనతో మాట్లాడాడని భయపెట్టడానికి మాత్రమే దాడి చేశానని చెప్పాడని లత చెప్పింది. 
 
భయపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ తహశీల్దార్ విజయారెడ్డి వినకపోవటంతో విజయారెడ్డిని చంపాలని ప్రయత్నించాడని లత చెప్పింది. ఈ భూముల వ్యవహారం కోసం 9 లక్షల రూపాయలు సురేశ్ అప్పు చేశాడని కానీ ఈ డబ్బులను ఎవరికి ఇచ్చాడనే విషయం మాత్రం తనకు చెప్పలేదని లత చెప్పింది. తహశీల్దార్ విజయారెడ్డి తన భర్త సురేశ్ ను లంచం అడిగిందని సురేశ్ తరువాత ఇస్తానని చెప్పాడని లత చెప్పింది. 
 
ఇప్పటిదాకా అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో లత వ్యాఖ్యలతో మరో మలుపు తిరిగినట్లు అయింది. మరోవైపు విజయారెడ్డి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు. నిందితుడు సురేశ్ తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు వచ్చిన తరువాత కారులోని వ్యక్తులతో మాట్లాడాడు. 
 
పోలీసులు సురేశ్ మాట్లాడిన వ్యక్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కారులోని వ్యక్తులను విచారిస్తే కొత్త విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. నిందితుడు సురేశ్ చనిపోవటంతో పోలీసులు ప్రస్తుతం కాల్ డేటా ఆధారంగా విచారణ చేపడుతున్నారు. సురేశ్ మొబైల్ లో కాల్స్ రికార్డ్ చేసుకునేవాడని ఆ సంభాషణల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. విజయారెడ్డి మృతి తరువాత రెవిన్యూ అధికారులు ప్రజాప్రతినిధులకు, నేతలకు వంత పాడుతున్నారన్న ఆరోపణలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: