దేశంలో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల రద్దు జరిగి నిన్నటికి సరిగ్గా మూడు సంవత్సరాలు అయింది. నోట్ల రద్దు సమయంలో సామాన్యులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు 2 వేల రూపాయల నోటు రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. నోట్ల రద్దు ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. 
 
ఆర్థిక వేత్తలు నోట్ల రద్దు వలనే దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో చలామణీలో ఉన్న నగదులో 8 లక్షల కోట్ల రూపాయలు 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. నల్లధనం దాచుకునేవారు భారీ స్థాయిలో 2వేల రూపాయల నోట్లను నిల్వ ఉంచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందువలన ప్రభుత్వం బ్యాంకులకు తిరిగి వచ్చే 2 వేల రూపాయల నోట్లను బ్యాంకులకు మాత్రమే పరిమితం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
2వేల రూపాయల నోటు సర్క్యులేషన్ ను తగ్గించటం ద్వారా ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టటంతో పాటు డిజిటల్ మనీ లావాదేవీలను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎన్.సి. గార్గ్ ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ సూచనను పరిశీలిస్తోందని అతి త్వరలోనే ఈ సూచనను అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
మరోవైపు 2 వేల రూపాయల నోటు రద్దు కాబోతుందని ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. గతంలో ప్రజలు ఊహించని విధంగా అకస్మాత్తుగా మోదీ నోట్ల రద్దు చేయడంతో 2 వేల రూపాయల నోటు రద్దు చేసినా ఆశ్చర్యం లేదని ప్రజలు భావిస్తున్నారు. కొందరు ప్రజలు మోదీ 2 వేల రూపాయల నోట్లు రద్దు చేసి కొత్త 1000 రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: