ఏపీలో కుల రాజకీయాలు మాములుగానే ఎక్కువ ఉంటాయి. అందులోనూ ఒకో పార్టీ ఒకో కులానికి ప్రాతినిధ్యం  వహిస్తాయి. వైసీపీ-రెడ్డి సామాజికవర్గం ఎక్కువ ఉంటే. టీడీపీలో కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఉంటుంది. ఇక కొత్త పార్టీ జనసేన కాపులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే మిగతా పార్టీల విషయం పక్కనబెడితే టీడీపీ-కమ్మ సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటుంది. మొన్నటివరకు అధికారంలో ఉన్నప్పుడూ ఎక్కడ చూసిన టీడీపీలో వారి డామినేషన్ నే కనిపించింది. అయితే ఓటమి తర్వాత మాత్రం ఆ సామాజికవర్గం నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.


అందులోనూ కమ్మ ఎమ్మెల్యేలు సాంతం మూగబోయారు. మేలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. ఆ 23 మందిలో కూడా 11 మంది కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక గెలిచిన దగ్గర నుంచి వీరిలో పెద్దగా యాక్టివ్ గా కనిపించే నేతలు తక్కువగా ఉన్నారు. కుప్పం నుంచి గెలిచిన టీడీపీ అధినేత చంద్రబాబుని పక్కనబెడితే..మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పెద్దగా బయటకు రావడం లేదు. అనంతపురం జిల్లాలో ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ పి‌ఏ‌సి పదవి వచ్చిన లోకల్ లో ఉన్న సమస్యలు వల్ల సైలెంట్ గా ఉండిపోతున్నారు.


అటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎలాగో సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో గెలిచిన నాలుగు సీట్లలో మూడు చోట్ల కమ్మ ఎమ్మెల్యేలే గెలిచారు. పర్చూరులో ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్ గా పని చేసుకుంటున్నారు. ఇక చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఏదో అలా అలా కాలం గడిపేస్తున్నారు. ఇక కృష్ణాలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి పరిమితమైతే...గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలో వైసీపీలోకి జంప్ కొట్టనున్నారు.


ఇక తూర్పుగోదావరిలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ మొదట్లో దూకుడుగానే ఉన్నారు. కానీ ప్రస్తుతం అనారోగ్య సమస్యల వల్ల సైలెంట్ అయిపోయారు. ఇక మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరావు, విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబులు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. మొత్తం మీద అధికారం కోల్పోయాక కమ్మ ఎమ్మెల్యేలు మూగబోయారనే చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: