మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై బీజేపీ నాయకత్వం తర్జన, భర్జన పడుతోంది . ఇప్పటికే గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెల్సిందే . ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన అతిపెద్ద రాజకీయ పార్టీ గా రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ని ఆహ్వానించిన గవర్నర్  , సభ లో బలాన్ని నిరూపించుకోవాలని కోరనున్నారు . బలనిరూపణ అంత ఆషామాషీ వ్యవహారమేమి కాదని కమలనాథులకు తెలుసు . ఎందుకంటే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చాలాదూరం లో నిలిచిపోయింది .


ఇది అదనుగా తీసుకుని మిత్రపక్షమైన శివసేన , ముఖ్యమంత్రి పీఠాన్ని చేరి రెండున్నర ఏళ్ళు పంచుకుందామని షరతు విధించింది . దానికి బీజేపీ నాయకత్వం ససేమిరా అనడం తో ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు ప్రారంభించింది . ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సభ లో బలాన్ని నిరూపించుకోలేకపోతే, శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించనున్నారు . ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన నాయకత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది . ఈ కూటమికి బయటి నుంచి మద్దతునిచ్చేనందుకు కాంగ్రెస్ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం .


 మహారాష్ట్ర లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుకోవాలని భావిస్తోన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి , శివసేన  నాయకత్వం లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తెర వెనుక నుంచి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది . బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా శివసేన ఓటింగ్ లో పాల్గొంటే , ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాము సహకరిస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ప్రకటించడం పరిశీలిస్తే , బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ను అడ్డుకోవాలన్న కృత నిశ్చయం తో ఉన్నట్లు స్పష్టమవుతోంది .  


మరింత సమాచారం తెలుసుకోండి: