ఒక థ్రిల్లర్ మూవీ ని తలపించే విధంగా మహారాష్ట్ర రాజకీయం నిమిషానికొక మలుపు తిరుగుతోంది. గవర్నర్ పిలుపు మేరకు శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గవర్నర్ విధించిన గడువు మరి కొద్ది గంటలు మాత్రమే వున్న నేపథ్యంలో శివసేన పార్టీ ఎన్సీపీ మరియు కాంగ్రెస్ తో భేటీ అయింది. ఎన్సీపీ విధించిన షరతు మేరకు శివసేన కు చెందిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు.  ‘తామెందుకు ఇంకా ఢిల్లీలో ఉండాలి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. మోదీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నా’ అంటూ సోమవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు.


అందరీ చూపు కాంగ్రెస్ వైపే 
శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్‌ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభ్యులు అంతిమ నిర్ణయాన్ని సోనియా గాంధీకి వదిలివేసేందుకు ఆమోదం తెలిపారు. ఎన్సీపీ చీఫ్‌ పవార్‌ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. ఆమెతో భేటీ అనంతరమే తమ నిర్ణయం తెలుపుతామని పవార్‌ ప్రకటించారు. దీంతో అందరీ కళ్లు కాంగ్రెస్‌ వైపు మళ్లాయి. ఈ మేరకు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం అయ్యి తాజా పరిణామాలపై సోనియా గాంధీ తో చర్చించారు.


శివసేన ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ మద్దతు ఇస్తే ప్రభుత్వ ఏర్పాటు కు మార్గం సుగుమం అవుతుంది. అంతా శివసేన అనుకున్నట్లు జరిగితే ఈరోజు సాయంత్రం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ప్రభుత్వ ఏర్పాటులో తాము మద్దతు తెలపాలంటే  శివసేన ఎన్డీయే కూటమి నుంచి పూర్తిగా బయటకు రావాలని  ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ షరతు పెట్టిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కు మద్దతు ఇస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: