ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది. 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది. 
 
సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది స్థితిగతులపై సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ ఎంప్లాయిస్ అనే వెబ్ సైట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ఇకనుండి ఈ కార్పొరేషన్ ద్వారానే ఉంటుందని చెప్పారు. 
 
ఈ కార్పొరేషన్ పరిధిలోకి రాష్ట్రస్థాయిలోని సెక్రటేరియట్ లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, 13 జిల్లాల్లోని అన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో పాటు లంచాలకు, మోసాలకు తావులేని విధంగా ఉద్యోగాలు ఇవ్వాలన్నదే లక్ష్యం అని సీఎం జగన్ తెలిపారు. 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించటంతో పాటు జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకు ఇచ్చేలా నిర్ణయించామని సీఎం జగన్ తెలిపారు. 
 
డిసెంబర్ నెల 15వ తేదీలోపు ఉద్యోగాల జాబితాలు కమిటీ నుండి, శాఖాదిపతుల నుండి రావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 15వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేసి జనవరి 1నుండి ప్లేస్‌మెంట్స్‌ ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి ఒక కోడ్ నంబర్ ఉంటుంది. ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. జిల్లా కమిటికీ జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తూ ఉండగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటాడని సమాచారం అందుతోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: