తెలంగాణ రాష్ట్రంలోని అబ్ధుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డిపై నిందితుడు సురేశ్ పెట్రోల్ పోసి విజయారెడ్డి సజీవదహనానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తరువాత రెవిన్యూ ఉద్యోగులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ధరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాక అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనపడినా భయపడుతున్నారు. విజయారెడ్డి ఘటన జరిగిన తరువాత రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు  జిల్లా పత్తికొండ తహశీల్దార్ తాడు కట్టి సంరక్షణ ఏర్పాటు చేసుకుంది. 
 
కొన్ని రోజుల క్రితం ఒక రైతు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక మండలంలోని తహశీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ డబ్బాతో వెళ్లగా రెవిన్యూ సిబ్బంది ఆ రైతును చుట్టుముట్టి ఎందుకు పెట్రోల్ డబ్బాతో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చావని ప్రశ్నించారు. ఆ రైతు తన బైక్ లో పెట్రోల్ లేదని అందుకోసం పెట్రోల్ కొనుగోలు చేశానని చెప్పటంతో రెవిన్యూ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరికొన్ని ప్రాంతాలలో తహశీల్దార్ కార్యాలయాలకు అధికారులు పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఎమ్మార్వోలు తమ గదిలోకి కార్యాలయ సిబ్బందిని తప్ప ఇతరులను రానివ్వడం లేదు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని ఒక తహశీల్దార్ కిటికీ నుండి రైతుల ధరఖాస్తులను స్వీకరిస్తున్నాడు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం కార్యాలయంలో అర్జీదారులు ఇచ్చే ధరఖాస్తులను అధికారులు కిటికీనుండి తీసుకుంటున్నారు. 
 
తహశీల్దార్ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఖచ్చితంగా తహశీల్దార్ కార్యాలయాల్లోకి అనుమతించాల్సి వస్తే అర్జీదారులను తనిఖీలు చేసిన తరువాత మాత్రమే తహశీల్దార్ కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారని తెలుస్తోంది.తనిఖీలు చేసి మాత్రమే తహశీల్దార్ కార్యాలయంలోకి అనుమతి ఇస్తూ ఉండటంతో ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు విధులను సరిగా నిర్వహిస్తే దాడులు ఎందుకు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: