ఒకే ఒకరోజులో తెలుగుదేశం పార్టీలో ఊహించని పరిణామాలు జరిగాయి. అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తూ ఆ పార్టీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలు వైసీపీ వైపు వెళ్ళిపోయారు. దేవినేని అవినాష్ సైలెంట్ గా వెళ్ళి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటే, వంశీ మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి బాబుని ఏకేశారు. గత కొన్ని రోజులు ముందే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన తాజాగా జగన్ కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జగన్ కు మద్ధతు ఇవ్వడానికి ఎమ్మెల్యే పదవే అడ్డం వస్తే రాజీనామా కూడా చేస్తానని ప్రకటించారు.


సరే తిట్టినా, విమర్శలు చేసినా ఇద్దరు నేతలు వైసీపీ వైపు వెళ్లారు. కానీ ఇక నుంచి ఇద్దరు నేతలు వదిలేసిన గుడివాడ,గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కెవరో అర్ధం కాకుండా ఉంది. మొన్న ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన అవినాష్...కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఇటు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గెలిచారు. అయితే వీరిద్దరు పార్టీని వీడటంతో టీడీపీ అధినాయకత్వం ఆ రెండు చోట్ల ఎవరిని నాయకుడుగా నిలబెడుతుందా? అని తెలుగు తమ్ముళ్ళు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.


గుడివాడలో రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, యలవర్తి శ్రీనివాసరావు లాంటి నేతలు ఉన్నారు. కానీ వీరికి కొడాలి నానిని ఢీకొట్టే సత్తా లేదనే విజయవాడ నుంచి అవినాష్ ని తీసుకొచ్చి ఎన్నికల బరిలో దింపారు. ఇప్పుడు అవినాష్ వెళ్లిపోవడంతో ఎవరు నానికి పోటీ ఇచ్చే నాయకుడో అర్ధం కాకుండా ఉంది. కాకపోతే రావి వెంకటేశ్వరావుకు గతంలో పోటీ చేసిన అనుభవం ఉండటంతో ఆయన్ని ప్రస్తుతానికి ఇన్-చార్జ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో పక్కనబెట్టి ఇప్పుడు ఇన్-చార్జ్ ఇస్తామంటే రావి ఒప్పుకుంటారా అంటే చెప్పలేం.


అటు వంశీ రాజీనామా చేసిన దగ్గర నుంచి గన్నవరంలో ఎవరిని దించాలని అధినేత ఆలోచిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, గద్దె అనురాధ, బొండా ఉమాలతో ఓ కమిటీ వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి ఇక్కడ ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారో అర్ధం కాకుండా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: