ఢిల్లీలో సరి బేసి విధానంతో ఉపయోగం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. రాజధానిలో వాయుకాలుష్యం పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు సరి బేసి విధానం శుక్రవారం ముగియడంతో.. పొడిగింపుపై సోమవారం నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేజ్రీవాల్.


ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో  విచారణ జరిగింది. సరి-బేసి విధానం అమల్లో ఉన్న రోజుల్లో వాయుకాలుష్య తీవ్రత వివరాలను కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి సుప్రీంకోర్టుకు అందజేసింది. సరి-బేసి విధానం అమలు వల్ల ఉపయోగం లేదనీ, ఆ విధానం అమల్లో ఉన్న రోజుల్లో కూడా గాలి కాలుష్యం తగ్గలేదని తెలిపింది. పంజాబ్‌, హరియాణా, యూపీ, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నవంబరు 29న సుప్రీంకోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సరి-బేసి విధానం కాలుష్య నియంత్రణకు సరైన పరిష్కారం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 


ఢిల్లీలో ఇంకా డీజిల్‌, కిరోసిన్‌ వాహనాల వినియోగాన్ని ఎందుకు నివారించలేకపోతున్నారో చెప్పాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని  ప్రశ్నించిన సుప్రీంకోర్టు. నియంత్రణ చేయలేకపోయిన అధికారులను ఎందుకు బాధ్యులను చేయకూడదని ప్రశ్నించింది. ఢిల్లీలో గాలి నాణ్యత పెంచడానికి సరైన మార్గదర్శకాలను ఏడు రోజుల్లోగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.


ఇప్పటికే ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పటికీ సరి-బేసి విధానాన్ని పొడిగించే విషయంలో కేజ్రీవాల్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ 4నుంచి ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లో ఉంది. శుక్రవారంతో ఈ విధానం ముగిసినా.. గాలి నాణ్యత పెరగకపోతే కొన్ని రోజుల పాటు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో వాయునాణ్యత సూచి 900పైగా నమోదయింది. లోభి రోడ్ సహా పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 5 వందల స్థాయిని తాకింది. వాయునాణ్యత సూచి 2 వందలు మించితేనే ప్రమాదకరంగా భావిస్తారు. అలాంటిది 8 వందల వరకు నమోదు కావడం గుబులు పుట్టిస్తోంది. ఢిల్లీలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ విద్యార్థులకు శ్వాసకోస సమస్యలు, ఆస్తమా తదితర రోగాలు వస్తున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: