ఆంధ్ర ప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సంక్షోభం నెలకొంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, టీడీపీ అధికారిక ప్రతినిధిగా పనిచేసిన సాధినేని యామిని కాషాయ పార్టీ చెంతకు చేరడం చక చకా జరిగిపోయాయి. రాజకీయాల్లో పార్టీ మార్పులు సహజంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, వీరిద్దరి పార్టీ మార్పులో మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకత ఉందనే చెప్పాలి. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక జగన్ మోహన్ రెడ్డికి జై కొట్టారు. 


తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు.... ప్రజలకు ఇలా సమస్యలు ఉన్నాయని చెప్పినా టీడీపీ అధిష్టానం పట్టించుకోకపోవడంపై వల్లభనేని వంశీ మండిపడ్డారు. దీనికి తోడు టీడీపీకి చెందని కొన్ని వెబ్ సైట్లలో తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంటూ వంశీ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. నా క్యారెక్టర్ ను నిర్ణయించడానికి వాళ్లెవరు అంటూ వంశీ ఫైర్ అయ్యారు. లోకేష్ కావాలనే ఇలా ఆర్టికల్స్ రాయించారని ఆయన ఆరోపించారు. 


ఇక టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన సాధినేని యామిని కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తనకు పదవి రావడం ఇష్టం లేని కొందరు టీడీపీ సోషల్ మీడియా అభిమానులు అనవసర పోస్టులు చేస్తూ.... క్యారెక్టర్ అసాసినేషన్  యామిని మండిపడ్డారు. ఈ విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని యామిని ఆవేదన వ్యక్తం చేశారు. 


మొత్తానికి వీరిద్దరూ పార్టీని వీడటానికి కాస్తో కూస్తో కారణం కొందరు తెలుగు తమ్ముళ్లే అని స్పష్టంగా బయటపడింది. అయినా  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలను పరిష్కరించుకోకుండా అధికారం కోల్పోగానే ఇలా కారణాలు చెప్పి పార్టీని వీడటమేంటనే వాదన కూడా కొందరు వినిపిస్తున్నారు. మరి విషయంలో సోషల్ మీడియా తెలుగు తమ్ముళ్లు ఏ విదంగా స్పందిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: