ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హైదరాబాద్ లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం షాక్ ఇచ్చింది. లక్ష్మీపార్వతి 14సంవత్సరాల క్రితం ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబుకు ఇచ్చిన స్టే గడువు ముగియడంతో నిన్న తదుపరి ప్రక్రియ చేపట్టటానికి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 
 
లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఈ విషయంపై ఏసీబీ విచారణ చేపట్టాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయమూర్తి వర్మ 2005 సంవత్సరంలో స్టే ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటినుండి ఈ కేసులో స్టే కొనసాగుతోంది. 
 
సుప్రీంకోర్టు 2018 సంవత్సరంలో సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని తీర్పు చెప్పింది. జడ్జి ఈ కేసులో 2005లో చంద్రబాబు తెచ్చుకున్న స్టేకు హైకోర్టు ఎలాంటి లిఖితపూర్వక పొడిగింపు ఉత్తర్వులను ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏసీబీ కోర్టు ఈ కేసులో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయం తీసుకుని ఈ కేసును ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. 
 
లక్ష్మీపార్వతి తరపు న్యాయవాది కోర్టుకు ప్రస్తుత దశలో ఈ కేసు గురించి చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించటానికి నిబంధనలు అంగీకరించవని తెలిపారు. లక్ష్మీపార్వతి తరపు న్యాయవాది 2005 సంవత్సరంలో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని, చంద్రబాబు తరపు న్యాయవాది ఈ విషయాన్ని నిర్ధారించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఏసీబీ కోర్టు విచారణ చేపట్టేందుకు అంగీకరించడం చంద్రబాబు నాయుడుకు షాక్ అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: