మనం తెలుసుకోబోతున్న స్కూల్ ప్రిన్సిపాల్ పేరు లక్ష్మీ పొత్రె. ఆమె ప్రతి రోజు స్కూల్ కి రాగానే చేసే పని ఏంటంటే టాయిలెట్లు కడగడం. మధ్యప్రదేశ్‌లోని షాపూర్‌ పరిధిలోని సహజ్‌పూర్ హైస్కూల్‌కు ఆమె ప్రిన్సిపాల్ గా చేరి ఏడాది కావస్తుంది. ఆమె వచ్చిన కొత్తలో ఆ స్కూలు వాతావరణం చాలా అధ్వానంగా ఉండేది. ఇక టాయిలెట్ల విషయానికొస్తే వర్ణించలేనంత మురికిగా ఉండేవి. దాంతో అశుభ్రమైన టాయిలెట్ల వల్ల ఆ పాఠశాల విద్యార్థులకు జబ్బులు వస్తాయేమోననే ఉద్దేశంతో తానే స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేయడం ప్రారంభించింది. చీపురు పట్టి పని చేస్తున్న లక్షి పోత్రెను చూసిన స్థానికులు కూడా తమ వంతుగా స్కూల్ పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. విద్యార్థులు, స్కూల్లో ఉన్న సిబ్బంది కూడా ఆమెకు సహాయంగా ఉంటూ స్కూల్ పరిసరాలను శుభ్రం చేస్తారు. 

 

ప్రిన్సిపాల్ లక్ష్మీ పోత్రె వచ్చిన తర్వాత ఆ స్కూల్ వాతావరణం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులతోనే పని చేయిస్తారు కానీ వారు మాత్రం పాఠశాల పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోరు. ఒకవేళ వారు గనుక లక్ష్మీ పోత్రే మాదిరే పరిసరాలను పట్టించుకున్నట్లు అయితే ప్రభుత్వ విద్యార్థినుల సంఖ్య తగ్గిపోయి ఉండేది కాదు. 

 

అందరి ఉపాధ్యాయులకు భిన్నంగా ఉంటూ ఈ మధ్యప్రదేశ్ ప్రిన్సిపాల్ టాయిలెట్స్ శుభ్రపరుస్తూ ఎంతోమంది ప్రశంసలను గెలుచుకుంది. ఆమె మాట్లాడుతూ "నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూలు వాతావరణం అధ్వానంగా ఉంది. అందుకే నేనే స్వయంగా ఈ స్కూల్ పరిసరాలను శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది కాకుండా గ్రామంలో ఉన్న ప్రజలకు పరిసరాల పరిశుభ్రత మీద అవగాహన కల్పించాను. వాళ్లు కూడా ఎంతో ఆసక్తితో చాలా బాగా సహకరిస్తున్నారు" అని చెప్పింది. కాగా ఈరోజు (నవంబరు 19) వరల్డ్ టాయిలెట్ డే నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: